దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్. ఆమె గొంతుమూగబోయి అప్పుడే ఏడాది కాలం అయిపోయింది.
2022 ఫిబ్రవరి 6న కరోనాతో బాధపడుతూ లత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారతీయ సినీ రంగానికే కాక.. యావత్ దేశానికే తీరని శోకం మిగిల్చింది.
అలాగే ఇండియన్ క్రికెట్ కూడా లత మృతితో కన్నీళ్లు పెట్టుకుంది. భారత క్రికెట్‌తో లతాది తల్లీబిడ్డల అనుబంధం. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.
కొన్ని దశాబ్దాలుగా లత బతికి ఉన్నన్ని రోజులు స్వదేశంలో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు లతా మంగేష్కర్ కోసం బీసీసీఐ రెండు వీఐపీ సీట్లను రిజర్వ్ చేసి పెట్టేది. ఈ సాంప్రదాయం గతేడాది వరకూ కొనసాగింది.
అయితే.. లతా మంగేష్కర్ అసలు ఇండియన్ క్రికెట్‌కు ఏం చేసింది. బీసీసీఐ ఆమెను అంతలా గౌరవించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఎలాంటి అంచనాలు లేకుండా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. అందరి లెక్కలను తలకిందులు చేస్తూ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది.
అప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉండి, క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న వెస్టిండీస్ జట్టుతో ఫైనల్లో తలపడి.. అసాధారణ ఆటతీరుతో విజయం సాధించి.. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ వరల్డ్ కప్ ఎత్తుకున్నప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. దేశం మొత్తం కపిల్ డెవిల్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది.
కప్పుతో స్వదేశానికి తిరిగొచ్చిన ఛాంపియన్ టీమ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో.. బీసీసీఐ సైతం వరల్డ్‌కప్ నెగ్గిన ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి నగదు పురస్కారం అందించాలని అనుకుంది.
జట్టులోని ఆటగాళ్లకు కనీసం ఒక లక్ష రూపాయలు చొప్పున అయినా ఇవ్వాలని భావించింది. కానీ.. చేతిలో చిల్లగవ్వలేదు. వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో ఆటగాళ్ల రోజువారీ ఖర్చుల కోసం తలా 20 పౌండ్లు సమకూర్చేందుకే బీసీసీఐ నానా కష్టాలు పడింది.
అప్పుడు ఆటగాళ్ల నజరానా ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ.. ప్రపంచ వేదికపై భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచి, మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన హీరోలకు కనీసం ఇది కూడా చేయకుంటే.. దేశం పరువుపోయేలా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. బీసీసీఐని దేవతలా ఆదుకుంది. బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్ దుంగార్పూర్ విజ్ఞప్తి మేరకు ఒక ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం చేసేందుకు లతా మంగేష్కర్ ముందుకు వచ్చారు.
అప్పటికే లతా మంగేష్కర్ పాటలతో భారతదేశం ఊగిపోతోంది. కచేరి కార్యక్రమంలో లత పాల్గొంటున్నారని తెలిసి.. ప్రజలు పెద్దఎత్తున్న టిక్కెట్లు కొనుక్కొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బీసీసీఐకి రూ.20 లక్షల వరకు నగదు సమకూరింది.
దీంతో వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లోని ఆటగాళ్లకు బీసీసీఐ తలా ఒక లక్ష రూపాయల నగదు బహుమతితో సత్కరించింది. అయితే.. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లతా మంగేష్కర్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండియాను ఛాంపియన్‌గా నిలిపిన జట్టు కోసం, క్రికెట్‌పై తనకున్న ఇష్టం కోసం, ప్రపంచ దేశాల మందు భారత్ పరువు పోకుండా ఉండాలని లత తన గొప్ప మనసును చాటుకున్నారు.
అందుకే బీసీసీఐ ఆమె ఉన్నంత కాలం టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు రెండు వీఐపీ టిక్కెట్లను రిజర్వ్ చేసి ఉంచేది. లతా మంగేష్కర్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడి నుంచి ఇండియన్ క్రికెట్ ఏ స్థాయికి చేరుకుందో మనం చూస్తునే ఉన్నాం.
మరి.. భారత క్రికెట్ కోసం లతా మంగేష్కర్ చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0 Comments:
Post a Comment