Urination on Air India flight: ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై యూరిన్ పోసి వార్తల్లోకెక్కిన శంకర్ మిశ్రా కోసం ఢిల్లీ, ముంబై పోలీసులు గాలిస్తున్నారు.
న్యూయార్క్ నుండి ఇండియాకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో తాగిన మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై.. అది కూడా 70 ఏళ్ల వయస్సుకుపైబడిన సీనియర్ సిటిజెన్ అయిన వృద్ధురాలిపై యూరిన్ పోసి వార్తల్లోకెక్కాడు ముంబైకి చెందిన శంకర్ మిశ్రా.
న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్ లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించడమే కాకుండా డిజిసిఏ వర్గాల్లో పెద్ద వివాదంగా మారింది.
ఎయిర్ ఇండియా విమానంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన శంకర్ మిశ్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంకర్ మిశ్రాను అరెస్ట్ చేయడం కోసం ఢిల్లీ నుంచి పలు పోలీసు బృందాలు ముంబైకి చేరుకున్నాయి.
ముంబైలో అతడు నివాసం ఉండే ఇంటితో పాటు అతడు ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది.
మొత్తానికి తనకు పోలీసుల నుంచి లీగల్ ట్రబుల్స్ తప్పవని భావించిన శంకర్ మిశ్రా తన ఇంటి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న శంకర్ మిశ్రాను వెతికి పట్టుకునేందుకు తమ బృందం పనిచేస్తోంది అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
శంకర్ మిశ్రా ఆచూకీ కోసం లుకౌట్ నోటీసులు
శంకర్ మిశ్రా దేశం విడిచిపారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అతడిపై లుకౌట్ నోటీసులు జారీచేయాల్సిందిగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
బాధితురాలు ఎయిర్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఇంతకీ ఎవరు ఈ శంకర్ మిశ్రా ?
విమానంలో దుష్ప్రవర్తనకు పాల్పడిన నేరం కింద దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ పాపులర్ అయిన శంకర్ మిశ్రా ఎవరు అనే కోణంలో చాలామంది ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ శంకర్ మిశ్రా ఎవరు ? ఎందుకిలా ప్రవర్తించాడు ? గతంలోనూ అతడికి ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదే విషయమై ఢిల్లీ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. అతడి గురించి ప్రాథమిక సమాచారం మొత్తం సేకరించినట్టు తెలిపారు.
అమెరికాకు చెందిన ఒక ఫినాన్షియల్ సర్వీసెస్ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన భారతీయ విభాగానికి శంకర్ మిశ్రా వైస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్నాడు. క్యాలిఫోర్నియాలో ఆ కంపెనీ ప్రధాన కార్యలయం ఉంది
ఎయిర్ ఇండియాకు డిజిసిఏ షోకాజ్ నోటీసులు
ఈ ఘటనపై డిజిసిఏ తీవ్రంగా స్పందించింది. ఘటనలో బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఎయిర్ ఇండియా సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాల్సిందిగా డిజిసిఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోచీసులు జారీచేసింది.
0 Comments:
Post a Comment