Sucide -
''పెన్షన్ తీసేశారు.. మేము బతకలేము'' అంటూ దంపతుల ఆత్మహత్య!
రాష్ట్రాలు అమలు చేస్తున్న పెన్షన్ పథకం ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. ముఖ్యంగా వృద్దాప్యంలో ఉన్న వారికి పెన్షన్ కొండంత అండగా మారుతోంది.
నెల నెల ఖర్చుల దగ్గరినుంచి అనారోగ్యంతో ఉన్నపుడు మందులు కొనుక్కోవటం వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. పెన్షన్లు అందని వృద్ధుల బాధ ఒక ఎత్తయితే.. నిన్న మొన్నటి వరకు పెన్షన్ అందుకుని, హఠాత్తుగా కోల్పోయిన వారిది మరో బాధ. అకస్మాత్తుగా తమకు వస్తున్న పెన్షన్ రద్దు కావటంతో ఓ వృద్ద జంట ఆత్మహత్య చేసుకుంది. పెన్షన్ తీసేశారు.. మేము బతకలేము'' అంటూనే ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి గొరకాయపాలేనికి చెందిన 79 ఏళ్ల కట్టా వెంకయ్య, 70 ఏళ్ల వెంకాయమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరికి పెన్షనే దిక్కయింది. ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి వారికి పెన్షన్ రావటం ఆగిపోయింది. విచారిస్తే.. పెన్షన్ రద్దు అయినట్లు తెలియవచ్చింది. దీంతో వృద్ద దంపతులు చిగురుటాకుల్లా వణికిపోయారు. తమకు జీవనాధారం అయిన పెన్షన్ పోతే పరిస్థితి ఏంటి అని చాలా రోజులనుంచి బాధపడుతూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే '' కాస్తంత పురుగుల మందు ఇవ్వండి. తాగి చనిపోతాం. ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం'' అంటూ పెన్షన్ కోల్పోయిన బాధను అందరితోనూ చెప్పుకునే వారు. అలా బాధపడుతూనే చివరకు ప్రాణాలు తీసుకున్నారు. పురుగుల మందు తాగి చనిపోయారు. వీరికి సహాయం చేయటానికి వీరి పిల్లలు నియమించిన వ్యక్తి.. విగతజీవులుగా పడి ఉన్న దంపతులను గుర్తించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పెన్షన్ రద్దు అయిందన్న బాధలోనే తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు పిల్లలు తెలిపారు. మరి, పెన్షన్ రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఈ వృద్ద దంపతుల ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0 Comments:
Post a Comment