ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఓ మనిషికి కనీసం 8 గంటల నిద్ర తప్పని సరి, కానీ జాబ్స్, మానసిక ఒత్తిళ్ల వల్ల చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా గడిపేస్తున్నారు. రాత్రి సమయంలో సినిమాలు, షికార్ల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు.
ఇలానే కొనసాగితే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి వల్ల శరీరం పైన ఒత్తిడి ఎక్కువగా పడుతుంది.
ఎక్కువ రోజులు నిద్ర పోకపోతే ఆ మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయమై ఓ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేసింది. ఆ సర్వేలో ఆందోళన కలిగించే నిజాలు బయటపడ్డాయి.
నిద్ర లేమితో సతమతం అవుతుంటే వారిలో కొంచెం మగతగా ఉంటుందట. ఈ కారణంగా వారిలో మెదడు పని చేయడం అనేది సరిగా ఉండదట.
ప్రతీ విషయానికి చిరాకుగా ఉంటుంది. చదువుకునే పిల్లల్లో అయితే ఏకాగ్రత దెబ్బతింటుంది. అంతే కాకుండా ఆ రోజంతా వారిలో ఒళ్లు నొప్పులుగా అనిపిస్తాయి. కొంత మందికి అయితే జ్వరం వచ్చినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది.
కళ్లు ఎర్ర బడడం, నాడీ వ్యవస్థ స్థిరంగా ఉండక పోవడం జరుగుతుందని తెలిస్తోంది. నిద్ర లేమి అనేది ముూడు రోజులకు మించి ఎక్కువ అయితే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడు సరిగా పని చేయక పోవడం, ఆలోచన శక్తి లోపించడం, కండరాలు ఒత్తిడికి లోను కావడం లాంటివి జరుగుతాయి.
మరీ ఎక్కువగా నిద్ర లేమితో బాధపడే వారు సర్వేంద్రియాలపై పట్టును కోల్పోతారని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి వారిలో కంటి చూపు కూడా మందగించే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిద్ర లేమి అనేది వారం రోజులకు పైగా వేధిస్తుంటే అలాంటి వారిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి వారిలో శరీరం సహకరించకుండా ఉంటుంది. చర్మం కూడా పొడి బారిపోయే అవకాశం ఉంది.
మరి కొంత మందిలో నిద్రలేమి అనేది నెల రోజుల పాటు కూడా ఉంటుంది. వారిలో మానసిక సంఘర్షణలు చోటుకుంటాయి. దీంతో మైండ్ మీద పూర్తిగా నియంత్రణ కోల్పోతారు. సాధారణ సమయాల్లో కూడా ఉలిక్కి పడిలేవడం లాంటి జరుగుతుంటాయి.
చిన్న దానికి కూడా కంగారు పడుతుంటారు. ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. తెలియని ఆలోచనలతో సతమతమౌతుంటారు. అందుకే సాధ్యమైనంతగా క్వాలిటీ నిద్ర మనిషికి అవసరం.
0 Comments:
Post a Comment