రోజువారీ జీవితంలో స్క్రీన్ సమయం పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం, లాప్టాప్ పై ఉద్యోగ పనులు, టీవీ చూడటం... ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో స్క్రీన్ సమయాన్ని అమాంతం పెంచేస్తున్నాయి.
ఇలా స్క్రీన్ సమయం ఎక్కువ కావడం వల్ల కంటి సమస్యలే వస్తాయని అనుకుంటారు చాలామంది. కానీ పెరుగుతున్న స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కళ్లపైనే కాదు చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా చేసిన అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విడుదలయ్యే కాంతి... మానవ చర్మ కణాలను దెబ్బతీస్తుందని ఈ అధ్యయనం చెప్పింది.
ఆ కాంతి మానవ చర్మం పై పడి ‘రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు’ ఉత్పత్తి అయ్యేందుకు దారితీస్తుంది. దీనివల్ల ఎక్కడైతే కాంతి అధికంగా పడుతుందో ఆ ప్రాంతంలోని కణాల మరణానికి కారణం అవుతుంది అని చెబుతున్నారు పరిశోధకులు.
ఎలక్ట్రానిక్ పరికరాలలో బ్లూ లైట్ అధికంగా వెలుగునిస్తుంది.ఈ బ్లూలైట్ను ‘హై ఎనర్జీ విజిబుల్’ అని కూడా పిలుస్తారు. స్పెక్ట్రమ్లో ఇతర రంగుల కంటే బ్లూ లైట్ ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది.
అందుకే ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ వల్ల మానవ కణాలు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంది.
ఎక్కువ సమయం పాటు స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు కళ్ళు పొడిబారడం జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మనం గుర్తించక పోయిన చర్మం కూడా పొడిబారుతుంది.
కొన్ని అధ్యయనాలు ప్రకారం స్మార్ట్ ఫోన్, లాప్టాప్లపై నిరంతరం పనిచేయడం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు రాలిపోవడం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. బహుశా దీనికి కారణం ఒత్తిడి అయి ఉండచ్చని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు.
అలాగే శారీరక శ్రమ తగ్గి, ఎక్కువ సమయం స్క్రీన్ ముందే కూర్చోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్క్రీన్ల నుండి వెలువడే నీలిరంగు కాంతి... జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
వెంట్రుకల కుదుళ్లకు హాని కలిగిస్తుంది. స్క్రీన్ సమయం ఎక్కువైనప్పుడు ఒకే భంగిమలో మనిషి అధిక సమయం కూర్చుంటాడు, ఇది శరీరంలో ఒత్తిడికి కారణం అవుతుంది.
తలలో ఒత్తిడి ఎక్కువైతే జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహం సరిగా జరగదు. ఇది జుట్టు రాలడానికి దారితీస్తున్నట్టు అంచనా.
సుదీర్ఘమైన స్క్రీన్ సమయం, జుట్టు, చర్మ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని అంటున్నారు శాస్త్రవేత్తలు.
0 Comments:
Post a Comment