📚✍️జీతమొస్తే పండగే!
♦️రుణాలకు ఇంకా అనుమతుల్లేవు
♦️బహిరంగ మార్కెట్ వేలానికి ఏపీ దూరం
♦️గ్రీన్ ఛానల్లోనే జీతాలు, పెన్షన్ల బిల్లులు
♦️నిధుల సర్దుబాటు ఎప్పటికో?
*🌻ఈనాడు, అమరావతి:* కొత్త సంవత్సరంలో.. సంక్రాంతి పండగ నెలలో కూడా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ల కష్టాలు తప్పడం లేదు. రెండో తారీకు రాత్రికి కూడా వీరికి జీతాలు, పెన్షన్లు అందలేదు. రాష్ట్ర ఖజానాలో సొమ్ము లేకపోవడం, అప్పు చేసేందుకు అవకాశం లేనంతగా పరిస్థితులు దిగజారిపోవడంతో ఉద్యోగులకు ఎప్పటికి ఊరట లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహిస్తూ ఉంటుంది. కేంద్ర ఆర్థికశాఖ నుంచి అనుమతి ఉంటే ఆ వేలంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయి. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ మంగళవారం ఏపీ ప్రభుత్వానికి బహిరంగ మార్కెట్ రుణం పొందే అవకాశం దక్కలేదు. తొలి తొమ్మిది నెలల్లో కేంద్ర ఆర్థికశాఖ ఇచ్చిన అనుమతి మేరకు ఎప్పుడో రుణాలు తీసుకుని వాడేశారు. చివరి త్రైమాసికంలో కొత్తగా రుణాలకు మళ్లీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం దిల్లీలో రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం వరకు ఎలాంటి అనుమతులు దక్కలేదని తెలిసింది. అనేకానేక వెసులుబాట్లు, ఇతరత్రా అంశాలతో రాష్ట్ర ఆర్థికశాఖ కొత్త అప్పుల కోసం అనుమతులు కోరుతున్నట్లు సమాచారం.
♦️రూ.12వేల కోట్ల అప్పులకు వేట
చివరి త్రైమాసికంలో రూ.12,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం అవసరమని రాష్ట్ర అధికారులు రిజర్వు బ్యాంకుకు తెలియజేశారు. వచ్చే మూడు నెలల్లో ఒక్క రిజర్వు బ్యాంకు సెక్యూరిటీల వేలంలోనే ఇంత మొత్తం రుణం కావాలని ప్రతిపాదనలు సమర్పించారు. అంటే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 12,000 కోట్ల మేర అప్పులకు అనుమతులు కోరుతోంది. జనవరిలో రూ. 7,000 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 4,000 కోట్లు, మార్చిలో రూ. 1,000 కోట్లు అవసరమని తెలియజేసింది. రిజర్వుబ్యాంకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రుణాల ఇండికేటివ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఈ రుణాలకు కేంద్రం అనుమతి ఇవ్వాలని పేర్కొంది. మంగళవారం నిర్వహించనున్న సెక్యూరిటీల వేలంలో ఏపీ పాల్గొనడం లేదు. కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది.
♦️ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఇంకా..
రాష్ట్రం కిందటి త్రైమాసికంలో ఏకంగా 28 రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉందని సమాచారం. ఏ త్రైమాసికంలోనైనా గరిష్ఠంగా 36 రోజులు మాత్రమే ఓడీలో ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబరు నెలకు సంబంధించి మొత్తం జీతాలు, పెన్షన్లు రూ. 5,500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్, కొంత రాబడుల సాయంతో కొద్ది మేర చెల్లింపులు చేసినా పూర్తి జీతాల కోసం వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందేనా అనే భయమూ ఉద్యోగులను వెంటాడుతోంది. కార్పొరేషన్ల సాయంతో రుణం తీసుకువచ్చి అవసరాలు తీరుస్తారా అనేది చూడాల్సి ఉంద.
0 Comments:
Post a Comment