✍️విద్యార్థులకు విషమ పరీక్ష
♦️సమ్మెటివ్-1లో ప్రయోగాలతో తీవ్ర ఒత్తిడి
♦️ఎనిమిదో తరగతికి సామాన్యశాస్త్రం, గణితంలలో బైజూస్ సంస్థ పరీక్షలు
🌻ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై పరీక్షల పేరుతో ప్రయోగాలు చేస్తూ వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒకసారి ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ప్రశ్నపత్రాలను మార్పు చేయగా.. ఇప్పుడు బైజూస్ సంస్థ రూపొందించిన ప్రశ్నపత్రాలను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1-8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరితోనూ ఆంగ్లంలో పరీక్షలు రాయించేందుకు ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. సమ్మెటివ్-1 పరీక్షల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు మండల విద్యాధికారులకు జిల్లా విద్యాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. సమ్మెటివ్-1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవగా.. ప్రధాన పరీక్షలు నాలుగో తేదీ నుంచి జరగనున్నాయి.
*♦️బైజూస్ ప్రశ్నపత్రాలతో...*
ఇక ఎనిమిదో తరగతి విద్యార్థులకు సామాన్య శాస్త్రం, గణితం సబ్జెక్టులకు బైజూస్ ప్రశ్నపత్రాలతో 9,10 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ట్యాబ్ల్లోని ప్రశ్నపత్రాలను ముద్రించి, పిల్లలతో పరీక్షలు రాయించనున్నారు. దాంతో ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రూ.40లక్షల వ్యయంతో ముద్రించిన ప్రశ్నపత్రాలను మూలనపడేశారు. గత నెల 21న ప్రారంభించిన బైజూస్ ట్యాబ్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొందరు విద్యార్థులు అసలు బైజూస్ పాఠాలు వినకపోయినా ట్యాబ్ల్లోని ప్రశ్నపత్రాలతో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో ఆ సంస్థ ప్రశ్నపత్రాలను రాయగలుగుతారా? అనే దాన్ని పట్టించుకోవడం లేదు.
*♦️ఇటీవల ప్రపంచ బ్యాంకు పరీక్షలు..*
ప్రపంచ బ్యాంకుతో పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఫార్మెటివ్ పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా(సీబీఏ) విధానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల అమలుకు నియమించిన ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పుల విధానాన్ని మార్చేశారు. ఫార్మెటివ్ పరీక్షల్లో 15మార్కులకు ఓఎమ్మార్ విధానంలో, మరో ఐదు మార్కులకు రాతపూర్వకంగా పరీక్ష నిర్వహించారు. 1-8 తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓమ్మార్తో నిర్వహించారు. ప్రశ్నపత్రంలో అబ్జెక్టివ్ ప్రశ్నలు ఇచ్చారు. వీటిని పాఠశాలలో ఉంచగా.. ఓమ్మార్లను రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. వీటిని విశ్లేషించి, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాల్సి ఉంది. దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక విడుదల చేయలేదు. ఈ పరీక్షల నిర్వహణకు రూ.కోట్లలో వ్యయం చేశారు. ప్రయోగాల పేరుతో ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడమే కాకుండా విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Comments:
Post a Comment