దేశంలోనే ఎక్కువ మంది ఇండియన్ రైల్వేలో (Indian Railways) ఉపాధి పొందుతున్నారు.
రైల్వేలో ఉద్యోగం కోసం చాలా మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇండియన్ రైల్వే అందజేస్తోంది.
గ్రూప్ డి పోస్టుల ప్రకటన అనంతరం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా 7,914 ఖాళీలను భర్తీ చేయనుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), నార్త్ వెస్టర్న్ రైల్వే(NWR) జోన్ల పరిధిలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఏ జోన్ పరిధిలో ఎన్ని ఖాళీలున్నాయి? ఎవరెవరు అర్హులు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు
విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(SCVT) ధ్రువీకరించిన ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు: రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొన్న వివరాల ప్రకారం.. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023, జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 24 ఏళ్లు మించకూడదు. అదే విధంగా 15 ఏళ్లు తగ్గకుండా ఉండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది.
పోస్టుల ఖాళీల వివరాలు:
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 4,103, సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో 2,026, నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో 1,785 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ఆయా జోన్లలో పోస్టులకు అప్లై చేయడానికి సంబంధిత అధికారిక వెబ్‌సైట్లను ఆశ్రయించాలని తెలిపింది.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు ఎంపికలో విద్యార్హత కీలకం కానుంది. మెరిటి లిస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉండనుంది. పదో తరగతితో పాటు, ఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించనుంది.
దరఖాస్తు విధానం:
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 4,103 పోస్టులకు scr.indianrailways.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ జోన్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.
కోల్‌కత్తా కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని 2,026 పోస్టులకు rrcser.co.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక 1,785 ఖాళీలున్న నార్త్ వెస్టర్ రైల్వే జోన్ కోసం.. rrcjaipur.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
0 Comments:
Post a Comment