పట్టాలపై వేగంగా వెళ్తున్న రైలులో కూర్చుని కిటికీలోంచి ప్రపంచాన్ని చూడాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది.
అదే విధంగా ఊరికి దూరంగా కూత వేస్తూ పరుగులు తీసే రైలు గురించి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా మందిలో ఉంటుంది.
ముఖ్యంగా రైలు వేగంపై ఆసక్తి ఉంటుంది. అయితే రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ వేగం ఎలా మారుతుందనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? రైలుకు ఎన్ని గేర్లు ఉంటాయో మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవాల్సిందే.
* నాచ్ అంటే ఏంటి? : సాధారణ వాహనాల మాదిరిగానే రైళ్లకు కూడా గేర్లు ఉంటాయి. కానీ ఇంజన్, రైలు రకం ఆధారంగా వాటికి పేర్లు ఉంటాయి. డీజిల్ ఇంజిన్‌కు ఉండే గేరు వ్యవస్థని 'నాచ్' అని పేర్కొంటారు. వ్యవహరిస్తుంటారు. ఇందులో 8 నాచ్‌లు ఉంటాయి. అంటే 8 గేర్లు అన్నమాట. 1 నుంచి 8 వరకు వరుసగా ఒకదాని వెంబడి మరొకటి వేస్తే రైలు వేగం క్రమంగా పెరుగుతుంటుంది. ఇలా వేగాన్ని పెంచుకోవడానికి ఒక్కో నాచ్‌ని పెంచుకుంటూ పోవాలి.
ఎనిమిదో నాచ్ వేస్తే టాప్ గేర్‌లో వెళ్తున్నట్లు లెక్క. అలాగే రైలు వేగాన్ని తగ్గించడానికి ఒక్కో నాచ్‌ని తగ్గించుకుంటూ రావాలి. అయితే ప్రతీసారి నాచ్‌ను మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రైలు వేగాన్ని అందుకుందంటే ఎంచక్కా అలాగే ఉంచొచ్చు.
8వ నాచ్‌లోనే పట్టాలపై ప్రయాణించొచ్చు. అయితే ఎలక్ట్రిక్ రైళ్లలో ఇలా మ్యాన్యువల్ గేర్ వ్యవస్థ ఉండదు. అంతా ఆటోమేటిక్. స్పీడుకు అనుగుణంగా గేరు మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి లోకో పైలట్ స్పీడును పెంచడం, తగ్గించడం చేయనక్కర్లేదు.
* పట్టాలపై ఆధారపడి ఉంటుంది : రైలు వేగంగా వెళ్లడానికి గేరు వ్యవస్థను వినియోగిస్తే సరిపోదు. రైలు వేగం పవర్ సెక్షన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. రైల్వే ట్రాక్ నాణ్యత, సమర్థతను తెలియజేసేదే పవర్ సెక్షన్. అంటే సదరు రైలు ఎంతవేగంతో వెళ్తే ట్రాక్‌లు భరించగలవు? గరిష్ఠ వేగం ఎంత? వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
రైలు ఎంత వేగంగా వెళ్లగలదు అని పక్కన పెడితే, సదరు రైల్వే ట్రాక్ ఎంత మేర స్పీడును తట్టుకోగలదో తెలిసి ఉండాలి. అంతకన్నా ఎక్కువ స్పీడ్, బరువుతో వెళ్తే రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే రైలును డిజైన్ చేసే సమయంలో ప్రయోగాత్మకంగా అధిక స్పీడ్‌తో నడిపించి చూస్తారు. ఏ స్పీడ్ వరకు పట్టాలు రైలు వేగానికి సహకరిస్తున్నాయో ఈ పద్ధతితో పరీక్షించి చూస్తారు.
* మీకు తెలుసా? : ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఇండియాలో రోజుకు దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల పాటు రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దేశంలో 68,000 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు ఉన్నాయి. సుమారు 13,000కు పైగా సర్వీసులను రైల్వే శాఖ నిర్వహిస్తోంది.
0 Comments:
Post a Comment