OPS vs NPS : వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందు నుంచే కొంత డబ్బు పొదుపు చేస్తుంటారు.
కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెరిగింది. అందరిలో రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకోవాలనే ధోరణి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో డబ్బు పొదుపు, మంచి పెన్షన్ కీలకంగా మారాయి.
అందువల్ల ఆర్థిక ప్రణాళికలో పెన్షన్ సిస్టమ్ ప్రధానంగా మారింది. ఇలాంటి వారికి వృద్ధాప్య భద్రతను అందించడానికి ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
అయితే తరచూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS), NPSలో ఏది బెస్ట్ అనే చర్చ జరుగుతోంది. రెండు స్కీమ్‌లు అందించే ప్రయోజనాలు ఏంటో చూడండి.
డిఫైన్డ్ బెనిఫిట్ సిస్టమ్ OPS
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది 'డిఫైన్డ్ బెనిఫిట్ సిస్టమ్'. అంటే పెన్షన్ ఉద్యోగి చివరిగా తీసుకున్న వేతనంతో ముడిపడి ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ గ్యారెంటీ పెన్షన్ విధానాన్ని తిరిగి పొందాలని డిమాండ్ చేయడానికి ఇదే ప్రధాన కారణం.
పెన్షన్ కమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ NPS
భారత ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ కమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ NPS. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరిలో ఈ స్కీమ్‌ను లాంచ్ చేశారు. 2009లో ఈ పథకాన్ని ప్రభుత్వం ఇతర రంగాలకు విస్తరించింది.
సురక్షితమైన, రెగ్యులేటెడ్ మార్కెట్ ఆధారిత రాబడి ద్వారా రిటైర్మెంట్ను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి దీర్ఘకాలిక పొదుపు మార్గాన్ని అందిస్తుంది.
ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. NPS కింద, రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి అందుకునే పెన్షన్.. ఉద్యోగి పని చేసే సంవత్సరాల్లో కాంట్రిబ్యూట్ చేసిన మొత్తంపై వచ్చే రాబడిపై ఆధారపడి ఉంటుంది.
ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. NPSలో సెక్షన్ 80CCD(1B) కింద అదనంగా రూ.50,000 విలువైన డిడక్షన్ పొందవచ్చు.
OPS, NPS మధ్య ప్రధాన తేడాలు
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతం నెలవారీ పెన్షన్‌గా పొందుతారు. అయితే ఎన్పీఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్.
ఇందులో ఉద్యోగి, యజమాని వారి సంబంధిత వాటాలను కాంట్రిబ్యూట్ చేస్తారు. OPSలో పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు. NPS ప్రైవేట్ రంగాన్ని కూడా కవర్ చేస్తుంది.
OPSకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. NPS అనేది దీర్ఘకాలంలో మార్కెట్ ఆధారిత రాబడిపై ఆధారపడి ఉంటుంది.
PFRDA కొత్త స్కీమ్?
PFRDA త్వరలో కొత్త ప్రొడక్ట్, మినిమం అష్యూర్డ్ రిటర్న్ ప్లాన్(MARS)ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తక్కువ రిస్క్ కోరుకునే పెట్టుబడిదారులను ఆకర్షించడం, పదవీ విరమణ తర్వాత గ్యారంటీడ్ అమౌంట్ అందుకోవాలని భావించే వారిని లక్ష్యంగా చేసుకుంది.
ఇది 10 సంవత్సరాలపాటు పెన్షన్ కార్పస్‌పై 4-5 శాతం గ్యారంటీడ్ ఇన్‌కం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే సూచనలు ఉన్నాయి.
0 Comments:
Post a Comment