ఆరోగ్యకరమైన అల్పాహారం చేయాలనుకుంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఇడ్లీ. అయితే చాలా మందికి ఒకే రకమైన ఇడ్లీ తినడం అంతగా నచ్చదు.
మీరు రెగ్యులర్ ఇడ్లీలకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే మీరు ఓట్స్ ఇడ్లీలను ప్రయత్నించవచ్చు.
ఈ ఓట్స్ ఇడ్లీ ఎంతో తేలికపాటి ఆహారం, బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో ఈ అల్పాహారాన్ని చేర్చుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.
ఓట్స్ ఇడ్లీలు చూడటానికి రవ్వ ఇడ్లీలని పోలి ఉంటాయి. ఇక్కడ రవ్వ స్థానంలో పోషకాలతో నిండిన ఓట్స్ ఉపయోగిస్తాము. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ గ్యారెంటీ.
ఓట్స్ ఇడ్లీల కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి. ఓట్స్ ఇడ్లీ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనలు పాటించి సులభంగా తయారు చేసుకోవచ్చు.
Oats Idli Recipe కోసం కావలసినవి
2 కప్పుల ఓట్స్
1 టేబుల్ స్పూన్ నూనె
1 స్పూన్ ఆవాలు
1 స్పూన్ శనగ పప్పు
1 స్పూన్ మినప పప్పు
1/2 స్పూన్ పసుపు పొడి
1 పచ్చిమిర్చి
1 క్యారెట్
1/2 కప్పు కొత్తిమీర
1/2 స్పూన్ ఉప్పు
2 కప్పుల పెరుగు
1/4 టీస్పూన్ ఈనో/ఫ్రూట్ సాల్ట్
ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం
ముందుగా ఒక పాన్‌ను వేడిచేసి దానిలో 2 కప్పుల ఓట్స్ తీసుకుని, వాటిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు పొడిగా కాల్చండి. చల్లారాక గ్రైండ్ చేసి పౌడర్ లా చేసుకోవాలి.
ఇప్పుడు మరొక వెడల్పాటి పాన్‌లో మీడియం మంట మీద నూనె వేడి చేయండి, అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి.
ఆపైన శనగపప్పు, మినప పప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
అనంతరం తరిగిన క్యారెట్లు, కొత్తిమీర వేసి, చిటికెడు ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా కలిపి ఒకటి -రెండు నిమిషాలు ఉడికించాలి. ఆపై స్టవ్ నుంచి దించి చల్లారనివ్వండి.
ఈ దశలో చల్లార్చిన మిశ్రమంలో ఓట్స్ పౌడర్ అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి..
ఇప్పుడు అవసరమైన పరిమాణంలో పెరుగు వేసి, దానికి చిటికెడు ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలపండి. మందపాటి ఇడ్లీ పిండి సిద్ధం చేసుకోవాలి.
ఈ బ్యాటర్ ను ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలుగా వేసి మీడియం మంట మీద సుమారు 15-20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి.
అంతే.. టేస్టీ, హెల్తీ ఓట్స్ ఇడ్లీలు రెడీ. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి.
0 Comments:
Post a Comment