Search This Blog

Friday, 27 January 2023

Jamuna: సీనియర్ నటి జమున కన్నుమూత..

 Jamuna: సీనియర్ నటి జమున కన్నుమూత..

సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున ఇక లేరు.
వయోధికభారంతో, అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమెకిప్పుడు 86 ఏళ్లు. 1953లో పుట్టిల్లు తో సినీ రంగ ప్రవేశం చేశారు నటి జమున. ఎల్వీ ప్రసాద్‌ తెరకెక్కించిన మిస్సమ్మ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణలాంటి ప్రముఖ హీరోలందరితోనూ లు చేశారు. తెలుగులోనే కాదు, తమిళ్‌, కన్నడ, హిందీ ల్లో నటించారు జమున.

*అందం, అభినయాలను కలబోసిన లలన… జమున*

తెలుగు చలనచిత్ర యవనికపై ఆమె వైభవ ప్రాభవాలు సినీచరిత్రలో సువర్ణ లిఖితాలు. ఆమె ఆత్మగౌరవ పోరాటాలు నేటితరం నటీమణులకు స్ఫూర్తిదాయకాలు. ఆమె ప్రతిభా సామర్థ్యాలు, రూపలావణ్యాలు ఉత్తమ కథానాయికలకు ప్రామాణికాలు. ఆమె పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దంపట్టినవే. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినయంగా తలలు వంచాయి. తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి కాపురపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్‌ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులూ పోషించనలవికానివే అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. ఆదర్శ గృహణిగా, సాంస్కృతిక సేవాభిలాషిగా ఆమె అపజయ మెరుగని నిత్య చైతన్యదీప్తి. ఆమే… తెలుగు సినీ అభిమానుల లావణ్యరాశి… నిప్పాణి జమున. ఆగస్టు 30 (1936) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జమున సినీ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం…
బాల్యం అడుగుజాడలు…
జమున పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్యపట్టణం హంపిలో. ఆమె మాతామహుడు వెంకటప్పయ్య విజయనగర సంస్థాన ఆస్థాన విద్యాంసులు. పితామహుడు నరసింగరావు న్యాయవాది. తల్లి కౌసల్యాదేవి హరికథా భాగవతారిణి, సంగీత విద్యాంసురాలు. తండ్రి శ్రీనివాసరావు విద్యాధికుడు, వ్యాపారవేత్త. ఆయన పసుపు, ప్రత్తి వంటి వాణిజ్య సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమున కుటుంబం ఆ గ్రామానికి వలసవచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు. చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరులోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళలమీద ఆసక్తి పెరిగింది. స్కూలు వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘ఢిల్లీ చలో’ అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర-వాసిరెడ్డి రచించిన ‘మాభూమి’నాటకంలో నటించే అవకాశం వచ్చినప్పుడు, బుర్రకథ పితామహుడు నాజర్‌ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు! అందులో ‘నరక కూపమీ క్రూర నైజాం పాలన రైతన్నా’ అనే పాటను జమున ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకుంది. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడ పట్టణాలలో ప్రదర్శిస్తే జమున కూడా ఆ బృందం వెంట వెళ్లి నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఒకసారి తెనాలి సమీపంలోని ముండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ అనే నాటకం వేయాల్సి వచ్చినప్పుడు, స్థానిక హైస్కూలులో టీచరుగా పని చేస్తున్న కొంగర జగ్గయ్య (ప్రఖ్యాత సినీనటులు) జమునను తన భుజాల మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటనగా చెప్పుకోవాలి.

సినిమా నటనపై ఆసక్తి
జమున బంధుమిత్రులు ఆమె తల్లితో “’అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి, అద్భుతంగా రాణిస్తుంది”అని సలహా ఇచ్చేవారు. అయితే ఆమె తల్లి మాత్రం విని వూరుకుండేది. కానీ జమున మనసులో సినిమాల్లో నటించాలనే బీజం తెలియకుండానే నాటుకుంది. జమున కౌమారదశకు చేరుకుంటున్నప్పుడు నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్‌నారాయణ వంటి జాతీయ నాయకులు దుగ్గిరాల గ్రామానికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో జమున ప్రార్థనాగీతం పాడింది. అప్పట్లో శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తి జమునకు పాటలు నేర్పేవారు. జమున పాడే విధానంకు ముగ్ధుడై జమునను సినిమాల్లో ప్రవేశపెడితే మంచి నటిగా రాణిస్తుందని సలహా ఇచ్చి, అందుకు కావాల్సిన ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పి వెళ్లాడు. అతడు చెబుతున్న మాటలు జమున ఆశల్ని చిగురింపజేశాయి. జమున పెదతండ్రి ఆర్‌.ఆర్‌.నిప్పాణికి స్నేహితులైన గరికపాటి రాజారావుతో జమున కుటుంబానికి పరిచయం కలిగింది. ఆయన రాజమండ్రి లో ప్రఖ్యాత బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు వి.ఎన్‌.రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు. జమున ఫొటోలను తీయించి బొంబాయిలోని వి.ఎన్‌.రెడ్డికి పంపారు. ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి సిఫారసుతో బి.వి.రామానందం అనే సినీ నిర్మాత తను నిర్మించబోయే ‘జై వీర బేతాళ’ అనే సినిమాలో జమునకు నటించే అవకాశాన్ని కలిపించారు. దాంతో జమున కుటుంబం మద్రాసు వెళ్లింది. కోడంబాకంలో ఉన్న స్టార్‌ స్టూడియోలో షూటింగు మొదలైంది. అందులో హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనది కూడా తెనాలి సమీపంలో వున్న రావికంపాడు గ్రామం. ఆయనకూ ఇదే మొదటి సినిమా. అయితే కొన్ని రీళ్ల సినిమా తీశాక రామానందం మృతితో ‘జై వీర బేతాళ’ నిర్మాణం ఆగిపోయింది. ఈలోగా రాజారావు నిర్మించే ‘పుట్టిల్లు’ సినిమాలో హీరోయిన్ గా జమున పాత్ర ఖరారైంది. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు. అందులో హీరో రాజారావు యాభై ఏళ్ల వయసులో ఉండగా, జమున టీనేజి తార కావడం ఒక కారణం కాగా, వ్యసన పరుడైన భర్తను వదిలేసి హీరోయిన్‌, స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు నచ్చకపోవడం మరో కారణమైంది. తర్వాత జమునకు సెకండ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాలు చాలా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సినీ పితామహుడు హెచ్‌.ఎం.రెడ్డి రోహిణి బ్యానర్‌పై రెండు భాషల్లో నిర్మించిన ‘వద్దంటే డబ్బు’ సినిమా. అందులో జమున, పేకేటి శివరాంకు జోడీగా నటించింది. సినిమా విజయవంతం కాలేదు. అదే సంవత్సరం సారథి ఫిలిమ్స్‌ వారు తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించిన ‘అంతా మనవాళ్లే’ సినిమాలో జమున సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. అది జమునకు కేవలం మూడవ చిత్రం మాత్రమే. ఆ సినిమా వందరోజులు ఆడింది. అలాగే కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణా వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. అంతే… జమున దశ తిరిగింది. ఇక వెనక్కి చూసుకోవాలిసిన అవసరం రాలేదు.

హీరోయిన్‌గా నిలదొక్కుకుంటూ…
1954లో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వాహినీ వారు నిర్మించిన ‘బంగారుపాప’, గోకుల్‌ ప్రొడక్షన్స్‌ వారు రజనీకాంత్ దర్శకత్వంలో నిర్మించిన ‘వదినగారి గాజులు’చిత్రాలలో నటించిన జమునకు వెండితెర అగ్రనటులతో హీరోయిన్‌గా నటించే అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. గోకుల్‌ ప్రొడక్షన్స్‌ వారే నిర్మించిన ‘నిరుపేదలు’ సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. నాగూర్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘ఇద్దరు పెళ్లాలు’ సినిమాలో ఎన్.టి. రామారావు సరసన హీరోయిన్ గా నటించినా అది కూడా సరిగ్గా ఆడలేదు. తర్వాత ప్రముఖ దర్శకనిర్మాత, బి.ఎన్‌.రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిఉన ‘మాగోపి’ చిత్రంలో వల్లం నరసింహారావు సరసన జమున హీరోయిన్‌గా నటించగా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. 1955లో విజయావారి ‘మిస్సమ్మ’ సినిమాలో అమాయకంగా నటించిన జమునకు మంచి పేరొచ్చింది. అలాగే బి.ఎన్‌.రంగా ‘తెనాలి రామకృష్ణ’ (1956) సినిమా నిర్మించినప్పుడు అక్కినేనికి జోడిగా జమున నటించింది. యన్‌.టి.రామారావుతో పొన్నలూరి బ్రదర్స్ నిర్మించిన ‘భాగ్యరేఖ’, డి.ఎల్. నారాయణ వినోదా బ్యానర్ మీద నిర్మించిన ‘చిరంజీవులు’లలో కూడా జమున నటించగా ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. దాంతో హీరోయిన్‌ ప్రధానాంశాలు గల చిత్రాలకు జమున అచ్చుగుద్దినట్లు సరిపోతుందనే పేరు వచ్చింది. ఆ తర్వాత ‘భూకైలాస్‌’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు, ‘అప్పుచేసి పప్పుకూడు’, చిరంజీవులు’, ‘ఇల్లరికం’, ‘ఈడూజోడూ’, ‘రాముడు భీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘గులేబకావళికథ’, ‘లేతమనసులు’, ‘తోడూ నీడా’ ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘తాసిల్దారు గారి అమ్మాయి’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘మట్టిలో మాణిక్యం’, ‘ఏకవీర’, ‘పండంటి కాపురం’, వంటి అనేక సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరుకుంది. సాహసానికి మారు పేరుగా నిలిచింది. కారణాలేవైనా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు దాదాపు నాలుగేళ్లపాటు జమునతో నటించకుండా ఆమెను బాయ్‌కాట్‌ చేశారు.
సాహస నటి
జమున వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని, ఎన్టీఆర్‌ ఇద్దరూ జమునతో నటించబోమని ప్రతికాముఖంగా ప్రకటించారు. సినిమా పరిశ్రమలో ఇక జమున పని అయిపోయిందనుకున్నారు. జమున షూటింగుకు లేటుగా వస్తుందని, పొగరబోతని, గర్విష్టని, కాలు మీద కాలువేసుకొని కూర్చుంటుందని, పెద్దల మీద గౌరవం లేదని ఈ ఇద్దరు అగ్రనటులు కారణాలుగా చూపించారు. అవి బాయ్‌కాట్‌ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్రపరిశ్రమకు తెలిసినా అగ్రనటుల ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు. అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పకపోవడం ఆమె గొప్పతనం. ఆ దశలో జగ్గయ్య, శోభన్‌బాబు, హరనాథ్‌, కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలలో నేటించింది. ఆమెకు పరపతి ఏమాత్రం మాత్రం తగ్గలేదు. ఆమెకు ఎప్పుడూ ఐదారు సినిమాలు చేతిలో ఉండేవి. అదే సమయంలో జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఎల్వీప్రసాద్‌ నిర్మించిన ‘హమ్‌ రాహి’(1963), ‘బేటీ బేటే’(1964) సినిమాల్లో జమున నటించింది. విజయా వారు ‘గుండమ్మ కథ’ (1962) సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్‌ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపజేయాలని నిర్ణయించారు. వీరి మనస్పర్థల వలన అప్పటికే ‘గుండమ్మ కథ’ రెండేళ్లు వెనకబడింది. చక్రపాణి, కె.వి.రెడ్డి రాజీయత్నాలు మొదలుపెట్టారు. అగ్రనటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని జమునకు సలహా కూడా ఇచ్చారు. కానీ ఈ ధీర వనిత ససేమిరా అంది. “చేయని నేరానికి నాలుగేళ్లపాటు హింసపెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి?” అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక లాభం లేదని చక్రపాణి అక్కినేని, ఎన్టీఆర్, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి, చనువుకొద్దీ వారిని మందలించి “ఇక అందరూ కలిసి పనిచేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తోంది” అంటూ చమత్కరించి సమస్యను తనదైన శైలిలో పరిష్కారం చేశారు. తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘గులేబకావళి కథ’, ’పూజాఫలము’ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. వారిద్దరి కాంబినేషన్ లో ‘మూగమనసులు’, ‘మురళీకృష్ణ’, ‘రాముడుభీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘పూలరంగడు’ సినిమాలు వచ్చాయి.
సంసారంలో జమున
1965లో పెద్దలు నిర్ణయించిన జూలూరి రమణారావుతో తిరుమల బాలాజీ సన్నిధిలో జమునకు వివాహం జరిగింది. అప్పుడు రమణారావు తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి చేస్తుండేవారు. వీరికి ఇద్దరు సంతానం. పెద్దబ్బాయి వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడగా, కూతురు స్రవంతి హైదరాబాదులోనే స్థిరపడింది. 1983లో జమున రాజకీయ ప్రవేశం చేసింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుంచి 1989లో పోటీచేసి అరవైవేల మెజారిటీతో గెలిచింది. మధ్యంతర ఎన్నికలు రావడంతో రెండవసారి గెలుపు సాధ్యం కాలేదు. కాకినాడ వద్ద తోలుబొమ్మల కళాకారుల కోసం ‘జమున నగర్‌’ అనే కాలనీని నిర్మించి వారికి ఆర్ధిక సహకారం అందించింది. ఇప్పటికీ ఆమె ఆ కళాకారులకు సహాయం చేస్తూనే వుంది. కొంతకాలం మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. జమున వంటి గొప్ప నటికి ‘పద్మ’ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయమే!
బాబూ మూవీస్‌ వారి ‘మూగమనసులు’ చిత్రంలో నటనకు 1964లో జమునకు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. మరలా 1968లో అదే గౌరి పాత్రను హిందీ ‘మిలన్‌’ చిత్రంలో జమున పోషించింది. అందులో నటనకు కూడా ఆమెకు మరొకసారి ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సహాయనటి బహుమతి లభించింది. 2008లో యన్‌.టి.ఆర్‌ జాతీయ పురస్కారం అందుకుంది.
సత్యభామ అంటే జమునే అనే అభిప్రాయం సినీ అభిమానులలో నాటుకుపోయిన అభిప్రాయం. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. తొలిసారి ‘వినాయక చవితి’ (1957) చిత్రంలో సత్యభామ పాత్రను జమున పోషించింది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో ఆమె పోషించిన సత్యభామ పాత్ర, నటనలో పరాకాష్ట అని చెప్పవచ్చు.
జమున తెలుగులోనే కాకుండా తమిళంలో పాతిక సినిమాలకుపైగా నటించింది. హిందీలో ఇరవై, కన్నడంలో ఆరు సినిమాల్లో నటించింది. ‘పుట్టిల్లు’ (1953)తో మొదలైన జమున సినీ నటప్రస్థానం హిందీలో నటించిన ‘రాజ్‌తిలక్‌’ (1983), తమిళంలో ‘తూంగాదే తంబిం తుంగాదే’(1983)తో ముగిసింది. తెలుగులో ఆమె చివరి చిత్రం ‘రాజకీయ చదరంగం’(1989). మొత్తం మీద జమున రెండు వందల చిత్రాలకు పైగానే నటించింది. జమునను ‘ఆంధ్రా నర్గీస్‌’ అని ‘హంపి సుందరి’ అని పిలుస్తుంటారు. నిజాయితీకి, ఉత్తమ సంస్కారానికి పెట్టింది పేరు ఈ లలన… జమున.

జమున గారి ఆకస్మిక మరణం సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు సద్గతిని ప్రసాధించాలని ఆ భగవంతుడను కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.

బ్రాహ్మణ చైతన్య వేదిక


0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top