దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్డీల నియామకాలకు ప్రస్తుతం అమలు చేస్తున్న కొలీజియం వ్యవస్ధను రద్దు చేయించేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది.
దీనికి రకరకాల అస్త్రాల్ని వాడుతోంది. ఇప్పటికే కొలీజియం వ్యవస్ధను అడ్డుకునేందుకు పార్లమెంటులో ప్రయత్నించి విఫలమైన కేంద్రం... ఆ తర్వాత బహిరంగ విమర్శలకు దిగింది. ఇప్పుడు కొలీజియం వ్యవస్ధపై సామాజిక న్యాయం అస్త్రాన్ని ప్రయోగిస్తోంది
కొలీజియంపై పోరు
దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్డీల నియామకాలకు అమలుచేస్తున్న కొలీజియం వ్యవస్ధను ఎలాగైనా తప్పించి జాతీయ న్యాయనియామకాల కమిషన్ ను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే సుప్రీంకోర్టు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పీటముడి పడింది.
గతంలో పార్లమెంటులో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జేఏసీ కోసం బిల్లు తీసుకొచ్చినా సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో కేంద్రం ముందుకెళ్లలేని పరిస్ధితి తలెత్తింది. అప్పటి నుంచి కొలీజియం వ్యవస్ధ ద్వారానే నియామకాలు జరుగుతున్నాయి.
తాజాగా మరోసారి కొలీజియాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం, ఈ క్రమంలో న్యాయవ్యవస్ధపై బహిరంగ విమర్శలకు కూడా దిగుతోంది. అంతటితో ఆగకుండా తాజాగా మరో తేనెతుట్టెను కదిపేందుకు సిద్ధమవుతోంది.
సామాజిక న్యాయం అస్త్రం.
కొలీజియం వ్యవస్ధను ఎలాగైనా తప్పించేందుకు రకరకాల కారణాలు వెతుకుతున్న కేంద్రం.. గతంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంటు చేసిన చట్టాల్నీ పక్కనబెట్టేస్తారా అంటూ సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా జడ్డీల నియామకాల్లో సామాజిక న్యాయమే లేదంటూ కులాల తేనెతుట్టెను కదుపుతోంది.
ఇందుకు సంబంధించి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఈ రెండు వ్యవస్ధల మధ్య పోరును మరో స్ధాయికి తీసుకెళ్లేలా చేస్తున్నాయి. తాజాగా పార్లమెంటరీ కమిటీకి న్యాయమంత్రిత్వశాఖ ఇచ్చిన రిపోర్ట్ లో జడ్డీల నియామకాల్లో సామాజిక న్యాయం లేదని పేర్కొనడం ఆయా కులాల్ని రెచ్చగొట్టేలా ఉంది.
ఓబీసీ జడ్డీలు 15 శాతమే..
దేశ జనాభాలో ఎక్కువగా ఉన్న ఓబీసీలను అస్త్రంగా మార్చి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కొలీజియం వ్యవస్ధపైకి ప్రయోగించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. జడ్డీల నియామకాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉందంటూ న్యాయమంత్రిత్వశాఖ తాజాగా పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో తేలింది.
దీన్ని బట్టి చూస్తే తాము దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొలీజియం జడ్డీల నియామకాల్లో అమలు చేయడం లేదని తేల్చేసింది. న్యాయశాఖ తాజా రిపోర్ట్ లో గత ఐదేళ్లలో కేవలం 15 శాతం ఓబీసీ జడ్డీల్ని మాత్రమే నియమించినట్లు తెలిపింది.
దీంతో ఇక్కడ సామాజిక న్యాయం జరగడం లేదని తేలిపోయింది. దీంతో సామాజిక న్యాయం చేయని కొలీజియం వ్యవస్ధను రద్దు చేయాలనేలా కేంద్రం పావులు కదుపుతోంది.
న్యాయశాఖ నివేదికలో చెప్పిందిదే.. !
న్యాయశాఖ తాజాగా పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, మహిళల నుంచి అర్హులైన వారిని జడ్డీలుగా ఎంపిక చేయాల్సిన బాధ్యత కొలీజియం వ్యవస్ధదేనని తెలిపింది.
2018 నుంచి 2022 డిసెంబర్ వరకూ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కేవలం 15 శాతం ఓబీసీలు, 1.3 శాతం ఎస్టీలు, 2.8 శాతం ఎస్సీలు, మైనార్టీలు 2.6 శాతమే ఉన్నారని వెల్లడించింది.
దీంతో జడ్డీల నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని న్యాయశాఖ ఆరోపించింది. దీంతో పార్లమెంటరీ కమిటీ ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
0 Comments:
Post a Comment