ఉద్యోగులపై ప్రత్యేక నిఘా
హాజరుపై ఆకస్మిక తనిఖీలు
ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటు
ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచుతోంది. వారిని కట్టడి చేసేందుకు ఒక్కొక్కటిగా అస్త్రాలను బయటకు తీస్తోంది. ఇప్పటికే ముఖ గుర్తింపు ఆధారిత హాజరును అమల్లోకి తీసుకురాగా.. తాజాగా కార్యాలయాల్లో ఉద్యోగులుంటున్నారా? లేదా అన్నది పరిశీలించేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల పని విధానం, హాజరుపై ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల హాజరుపై తనిఖీలు చేయాలని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే డివిజన్ల వారీగా స్క్వాడ్లను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో.. ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు తర్వాత పనివేళల్లో కార్యాలయాల్లో ఉంటున్నారా? లేక బయటకు వెళ్తున్నారా అనేది పరిశీలించాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులపై నిఘా కోసం ఈ జిల్లాలో తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్లయింగ్ స్వ్కాడ్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. కార్యాలయాల పని వేళల్లో హాజరు, కదలిక రిజిస్టర్ల ప్రకారం సిబ్బంది పని చేస్తున్నారా? గైర్హాజరయ్యారా? వంటి అంశాలను పరిశీలించి ప్రత్యేక బృందాలు నివేదికను రూపొందిస్తాయి. అన్ని అంశాలనూ క్రోడీకరించి ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందజేస్తాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటైన ఫ్లయింగ్ స్వ్కాడ్ల నివేదికలను పరిశీలించి పర్యవేక్షించాల్సిన బాధ్యత డీఆర్వో, జడ్పీ సీఈవోలదేనని కలెక్టర్ హరినారాయణన్ స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment