హిందూ వివాహం చట్టం (Hindu Marriage Act)లోని సెక్షన్ 24 ప్రకారం.. భార్య నుంచి భర్త.. భరణం పొందవచ్చు. కానీ.. అందుకు ఒక కండీషన్ ఉంది. అతను శారీరకంగా గానీ, మానసికంగా గానీ మనీ సంపాదించలేని పరిస్థితిలో ఉండాలి.
తనకు తానుగా ఉద్యోగం పొందలేని పరిస్థితి ఉండాలి. అప్పుడు మాత్రమే అతను భరణం (maintenance) కోరవచ్చు అని కర్ణాటక హైకోర్టు (Karnataka high court) తన తాజా తీర్పులో తెలిపింది.
"వాస్తవానికి తనను తాను అలాగే భార్య, బిడ్డను కాపాడుకోవడం సమర్ధుడైన భర్త యొక్క విధి. పిటిషనర్/భర్త ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 'తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలు'" అని జస్టిస్ ఎం నాగప్రసన్న.. పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తన ఆర్డర్లో తెలిపారు.
బెంగళూరు రూరల్ జిల్లాలోని సలుహునాసే గ్రామానికి చెందిన పిటిషనర్ (భర్త)... తన భార్య నుంచి భరణంగా రూ.2 లక్షలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ దరఖాస్తును కొట్టివేస్తూ అక్టోబర్ 31, 2022న.. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ తీర్పును సవాలు చేస్తూ... హైకోర్టుకు వెళ్లారు.
కరోనా కారణంగా తనకు ఉద్యోగం పోయిందనీ.. అందువల్ల తనకు తన భార్య నుంచి భరణం ఇప్పించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. కానీ హైకోర్టు అందుకు ఒప్పుకోలేదు.
"ఈ కేసులో పిటిషనర్‌కి ఎలాంటి వైకల్యమూ లేదు. కరోనా కారణం చూపుతూ... అతనికి భార్య ద్వారా భరణం ఇప్పిస్తే.. అతను పని పాటా లేకుండా బద్ధకస్థుడిగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు.. అతను సంపాదించలేని పరిస్థితిలో కూడా లేడు" అని తీర్పులో జస్టిస్ నాగప్రసన్న తెలిపారు.
"ఈ కేసులో భర్త నాటకాలాడుతూ.. భార్య చేతిలో భరణం కోరుతూ... ఏ పనీ చెయ్యకుండా ఖాళీగా ఉండాలనుకుంటున్నాడన్నది కాదనలేని అంశం. ఇలాంటి అంశాన్ని స్వాగతించలేం. ఇది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది" అని న్యాయమూర్తి అన్నారు.
ఇదీ కేసు:
ఈ జంట ఫిబ్రవరి 6, 2017న వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా, ఆమె తన అత్తవారింటిని విడిచిపెట్టి, పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె భర్త విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.
దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ భార్య పిటిషన్ దాఖలు చేసింది. నెలకు రూ.25,000 మెయింటెనెన్స్, రూ.లక్ష వ్యాజ్యం ఖర్చులు ఇవ్వాలని కోరింది.
అతను... నెలకు రూ.2 లక్షలు పోషణ, వ్యాజ్య ఖర్చుల కింద రూ.30 వేలు ఇవ్వాలని కోరుతూ ఆమె లాగానే దరఖాస్తు చేసుకున్నాడు.
తన భర్త రూ.50,000-60,000 నెలసరి జీతంతో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడనీ, ఆస్తులను అద్దెకు ఇచ్చాడనీ, వాటి నుంచి అతనికి నెలకు రూ.75,000 వస్తోందని ఆమె తెలిపింది. దాంతో.. అతనికి భరణం ఇవ్వాల్సిన పనిలేదని కోర్టు తీర్పు ఇచ్చింది.
0 Comments:
Post a Comment