ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు పని చేసేవారు ఎప్పుడు కూర్చుని ఉంటారు. అలాగే ఏదైనా ఫ్రీ టైం దొరికిందంటే దాదాపు అందరూ చేసే పని కూర్చుని ఉండటం.
అయితే ఎప్పుడు కుర్చీలకే అతుక్కుని పోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సాధారణంగా కొందరు అధిక బరువు సమస్య నుంచి బయటపడటం కోసం కఠినమైన డైట్ ఫాలో అవుతుంటారు.
అలాగే చెమటలు చిందేలా వర్కౌట్స్ చేస్తుంటారు. అయినా సరే బరువు తగ్గరు. దీనికి కారణం ఏంటా అని జుట్టు పీక్కుంటూ ఉంటారు.
అయితే అతిగా కూర్చోవడం ఇందుకు ఒక కారణం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే కష్టతరమైన వర్కౌట్లు, ఇంట్లో పనితో బోలెడు వ్యాయామం అంటారా.. అవేమీ నిరంతరం కూర్చుని ఉండే వారికి పెద్దగా సహాయపడవని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల ఎంత కష్టపడినా సరే బరువు తగ్గరు. అందుకే అదే పనిగా కూర్చుని ఉండటం కాకుండా.. అర గంటకు ఒకసారి అయినా పైకి లేచి అటు ఇటు నాలుగు అడుగులు వేస్తే వేగంగా బరువు తగ్గుతారు.
అలాగే అతిగా కూర్చుని ఉండటం వల్ల వేధించే మరో సమస్య నడుము నొప్పి. అదే పనిగా కూర్చుని ఉండటం వల్ల విపరీతమైన నడుము నొప్పి వేధిస్తూ ఉంటుంది.
అంతే కాదండోయ్ ఎప్పుడు కూర్చుని ఉండటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
మరియు అతిగా కూర్చుని ఉండటం వల్ల థైరాయిడ్, పాదాల వాపు వంటి సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడూ కూర్చుని కాకుండా వాకింగ్ చేస్తూ ఉండాలి. ఫోన్ వచ్చినపుడు నడుస్తూ మాట్లాడండి.
మీటింగ్ సమయంలోనూ వీలుంటే నిల్చొని లేదా నడుస్తూ విషయం వివరించండి. అలాగే ల్యాప్ టాప్, కంప్యూటర్ల ముందు వర్క్ చేసేవారు కనీసం గంటకు ఒకసారైనా గ్యాప్ తీసుకుని అటు ఇటు రెండు రౌండ్లు వేయండి.
ఇలా చేస్తే అతిగా కూర్చుని ఉండటం వల్ల వచ్చే సమస్యలకు వీలైనంతవరకు దూరంగా ఉండవచ్చు.
0 Comments:
Post a Comment