ఆ ఉద్యోగ నేతపై జగన్ సర్కార్ ఆరా ? గవర్నర్ అపాయింట్ మెంట్ వెనుక ఎవరు ?
AP లో ఉద్యోగులకూ, ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న గ్యాప్ నిన్న పతాకస్ధాయికి చేరింది. అలాగే ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు కూడా ఒక్కసారిగా బయటపడ్డాయి
దీనంతటికీ కారణం ఏపీ ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలపై స్పందన లేకపోవడం, నిరసనలకు అనుమతులివ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ ను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో జోక్యంచేసుకుని ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు ఇప్పించాలని కోరింది. దీనిపై జగన్ సర్కార్ ఆగ్రహంగా ఉంది.
గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలపై నిన్న గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించడం లేదని, నిరసనలకు కూడా అనుమతివ్వడం లేదని ఇలాంటి పరిస్ధితుల్లో తప్పనిసరై మీకు ఫిర్యాదు చేస్తున్నట్లు గవర్నర్ కు తెలిపారు. ఈ బృందానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులసంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వం వహించారు. గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుకు దారి తీసిన కారణాల్ని కూడా వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి మంటపుట్టించింది.
కేఆర్ సూర్యనారాయణపై సర్కార్ గరంగరం ?
గవర్నర్ ను కలిసి తమపై ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణపై సర్కార్ ఆగ్రహంగా ఉంది. ప్రభుత్వంతో పలుమార్లు చర్చల్లో పాల్గొన్న ఆయన.. ఇప్పుడు బకాయిలపై ఏకంగా గవర్నర్ కు వెళ్లి ఫిర్యాదు చేయడమేంటని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆయన గవర్నర్ ను కలిసిన తర్వాత తమను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలతో కూడా సీఎం జగన్ ఇదే విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ ఎన్జీవో నేతగా మరోసారి ఎన్నికైన బండి శ్రీనివాసరావు కేఆర్ సూర్యనారాయణపై విమర్శలకు దిగారు. హెచ్చరికలు కూడా చేశారు. దీంతో ఉద్యోగుల మధ్య విభేదాలు బయడపడ్డాయి.
జగన్ సర్కార్ కూపీ ?
ఆర్థికపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల వ్యవహారంపై ప్రభుత్వం కూపీ లాగుతోంది. ఈ మేరకు సూర్యనారాయణకు గవర్నర్ అపాయింట్మెంట్ ఎవరు ఇప్పించారు అన్న అంశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సూర్యనారాయణపై ఉన్న గత ఆరోపణలపైనా ప్రభుత్వం వివరాలు కోరినట్లు సమాచారం. నిన్న సీఎం జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాసరావు కూడా సూర్యనారాయణపై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సూర్యనారాయణ దొంగచాటున గుర్తింపు తెచ్చుకున్నారని బండి ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ, బీజేపీ అండతోనే ?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వెనుక ప్రతిపక్ష పార్టీలు వున్నాయన్న అనుమానంతో వున్న ప్రభుత్వం.. సూర్యనారాయణకు బిజెపీ తో వున్న సంబంధాలతో పాటు, టీడీపీ సహకారం వుందా ? అన్న కోణంలో రహస్య విచారణ జరుపుతోంది. గతంలో బిజెపి నుంచి ఎమ్యెల్యే టికెట్ ఆశించిన సూర్యనారాయణపై.. ఈ మేరకు విమర్శలు కూడా ఉన్నాయి. సూర్యనారాయణ వెనుక ఏ శక్తి పనిచేస్తుందో ఉద్యోగులు అంతా గమనిస్తున్నారని బండి శ్రీనివాస్ చేసిన విమర్శలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి.
0 Comments:
Post a Comment