జుట్టు ఎక్కువగా రాలడం, బట్టతల వంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా వయస్సు ప్రభావం, జన్యుపరమైన కారణాలు, పోషక లోపాలు, జీవనశైలి అలవాట్లు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలికమైన ఒత్తిడి, మందుల వాడకం కారణాలు ఉంటాయి.
స్త్రీ, పురుషులిద్దరికీ బట్టతల సమస్యలు ఉంటాయి, అయితే ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఒక ప్యాచ్ లాగా బట్టతల ఏర్పడుతుంది.
ఇలాంటి ప్యాచ్ లను కొన్ని ఆయుర్వేద నివారణల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణురాలు, హెల్త్ కోచ్ అయిన డాక్టర్ డింపుల్ జంగ్దా పేర్కొన్నారు. ఈ క్రమంలో బట్టతల ప్యాచెస్ కోసం కొన్ని ప్రభావవంతమైన ఇంటి నివారణలను ఆమె పేర్కొన్నారు.
Ayurveda Remedies for Bald Patches- బట్టతలకు ఆయుర్వేద చిట్కాలు
ఇంట్లో ఉపయోగించే మెంతులు, అల్లం, కలబంద, కర్పూరం మొదలైన పదార్థాలతోనే సమర్థవంతంగా బట్టతల ప్యాచ్ లను ఎదుర్కోవచ్చు, వేటిని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోండి.
కర్పూరం
కర్పూరం స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి జుట్టుకు అప్లై చేసి, ఒక 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తున్నకొద్దీ చుండ్రు తొలగిపోతుంది, జుట్టు పెరుగుతుంది.
కలబంద
చుండ్రు వల్ల వచ్చే స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది UV నష్టం నుండి కూడా జుట్టును రక్షిస్తుంది. తాజా కలబంద జెల్‌ను తలపై, జుట్టు తంతువుల మధ్య రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచుకొని ఎప్పటిలాగే జుట్టు శుభ్రం చేయండి.
అల్లం
అల్లంలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి, జుట్టు కుదుళ్లను పునరుద్ధరిస్తాయి. అల్లం తురుమును ఆలివ్ నూనెలో కొన్ని నిమిషాలు నానబెట్టండి. అనంతరం దీన్ని తలకు పట్టించి 2-3 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ జుట్టును షాంపూతో కడగాలి.
మెంతులు
ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన రెండు పోషకాలు ఐరన్, ప్రొటీన్ల గొప్ప మూలం. మెంతులలో కొంచెం నీరు, మజ్జిగా కలిపి పేస్ట్ లాగా చేయాలి.
ఈ పేస్టును తలకు పట్టించి గంటపాటు ఉంచుకోవాలి. ఆపై తేలికైన షాంపూతో సున్నితంగా కడిగేసుకోవాలి. కొన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.
మీరు మెంతికూరను కూడా ఉపయోగించవచ్చు. మెంతి ఆకులను పేస్ట్ చేసి, ఆ పేస్టును తలకు పట్టించాలి. తక్కువ నుండి మితంగా ఉండే జుట్టు రాలడాన్ని ఇది నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
0 Comments:
Post a Comment