✍️వాటీజ్ దిస్? ఇలాగైతే ఎలా?
♦️ఉద్యోగుల్లో ఈ నిరసనలేమిటి?
♦️1న జీతాలు ఎందుకివ్వడం లేదు?
♦️రంగంలోకి దిగిన గవర్నర్.. సీఎస్‌కు పిలుపు!
♦️జీతభత్యాల ఆలస్యంపై ఆరా తీసిన విశ్వభూషణ్
♦️ఉద్యోగులకు ఏం చేస్తున్నారో ప్రకటించొచ్చు కదా
♦️పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని సూచన
♦️గవర్నర్‌కు వివరణ ఇచ్చుకున్న జవహర్‌రెడ్డి
♦️ఆ వెంటనే ఆర్థిక శాఖ నుంచి భారీ ప్రకటన
🔺ఉద్యోగులకు ఏ ఇబ్బందీ రాకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎస్ వివరణ! ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటే వారు తనను కలిసే పరిస్థితి ఎందుకొచ్చిందని గవర్నర్ సూటిప్రశ్న! రాజ్‌భవన్‌లో శనివారం అరగంట జరిగిన భేటీలో ఉద్యోగుల జీతభత్యాలు సహా ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన అనేక పెండింగ్ అంశాలపై గవర్నర్ నేరుగానే నిలదీసినట్టు తెలిసింది.
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి):* ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఆలస్యం, వారి ఆందోళనలపై కేంద్రం కదిలింది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించి, దిద్దుబాటు చర్యలకోసం రాష్ట్ర గవర్నర్‌ను రంగంలోకి దించినట్లు తెలిసింది. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డిని రాజ్‌భవన్‌కు పిలిపించి మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం ఇచ్చేందుకు సీఎస్ రాజ్‌భవన్‌కు వెళ్లారని అధికారవర్గాలు చెబుతున్నా, అక్కడ జరిగిన భేటీలో ఉద్యోగుల ఆందోళనలు, వారి సమస్యల గురించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రధానంగా ప్రస్తావించినట్లు తె లిసింది. దాదాపు అర్ధగంటపాటు ఈ భేటీ జరిగింది. గత కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదులు, జీతభత్యాల చెల్లింపుల్లో ఆలస్యంపై జరుగుతున్న ఆందోళనలను సీఎస్ వద్ద గవర్నర్ ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది.
♦️విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.... ఉద్యోగులు ఎందుకు నిరసనగళం వినిపిస్తున్నారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘ఇంతకు ముందు ఉద్యోగ సంఘం ప్రతినిధులు వచ్చి తమ విన్నపాలు చెప్పుకొని వెళ్లారు. రెండురోజుల క్రితం మరో ఉద్యోగ సంఘ ప్రతినిధి బృందం వచ్చి వినతిపత్రం ఇచ్చింది. ఫైనాన్స్ కోడ్‌లో ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఉంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సమయానికి పింఛన్లు ఎందుకు వెళ్లడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?’’ అని గవర్నర్ ఆరాతీసినట్లు తెలిసింది. తమకు ఉద్యోగులతో ఏ సమస్యా లేదని, వారికి ఏ ఇబ్బందీ రాకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎస్ వివరించినట్లు తెలిసింది. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నదని, మరికొన్ని అంశాలపై పరిశీలన జరుగుతోందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
♦️లోపం ఎక్కడుంది?
ఉద్యోగులకు ఏ ఇబ్బందీ రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే వారు తనను కలిసే పరిస్థితి ఎందుకొచ్చిందని గవర్నర్ సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ‘‘ఉద్యోగుల మేలుకోరి ఎన్నో చేశాం అని మీరు చెబుతున్నారు. మాకు అన్నింటా అన్యాయమే జరుగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ప్రకటించలేదు? అవి వారికయినా ఎందుకు చెప్పలేదు? లోపం ఎక్కడుంది?’’ అని గవర్నర్ ఆరాతీసినట్లు తెలిసింది. ఉద్యోగుల్లోని ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, పరిస్థితి అదుపుతప్పకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు తెలిసింది.
♦️ఇదిలాఉండగా, ఈ పరిస్థితి ఎదురవుతుందని ముందే సీఎస్ అంచనా వేసి ఉంటారు. అందువల్లే ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం తీసుకున్న, పరిశీలనలో ఉన్న అంశాలపై వివరణాత్మక రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ సమావేశం తర్వాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నుంచి పలు అంశాలపై ఓ సుదీర్ఘమైన ప్రకటన వెలువడింది. అందులో ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను ప్రస్తావించారు. గవర్నర్‌తో సీఎస్ సమావేశం ముగిశాకే ఈ ప్రకటన వెలువడటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
0 Comments:
Post a Comment