Aadhar Update : ఏపీ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు..
ఇప్పుడు ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరైంది. అయితే.. ఆధార్ కార్డులో తప్పులు ఉండటంతో ఎంతో ముఖ్యమైన పనులు కూడా పెండింగ్ పడుతున్నాయి.
అయితే.. ఆధార్ సెంటర్లకు దగ్గరకు వెళితే అక్కడ క్యూ గట్టిగానే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో.. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్లు నిర్వహించనున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ నెల 19 నుంచి 24 తేదీ వరకు ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా.. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం.
ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా.
0 Comments:
Post a Comment