Viral ఒక్కసారి నాటేస్తే 8 సార్లు పంట!
ఓక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పీఆర్-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు.
నాలుగేండ్ల క్రితమే దానిని అక్కడి రైతుల చేతికి ఇచ్చారు.
చైనా వరి వంగడం పీఆర్-23పై రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా సంస్థ అధ్యయనం
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఒక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. పీఆర్-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు. నాలుగేండ్ల క్రితమే దానిని అక్కడి రైతుల చేతికి ఇచ్చారు. పీఆర్-23 రకం వరి నారును ఒకసారి నాటితే వరుసగా ఎనిమిది సీజన్లలో పంట కోతకు వస్తున్నది. ఒక్కొక్క సీజన్లో ఎకరాకు సగటున 27 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. ఒకసారి వరి కోసిన తరువాత పిలకలకు నీళ్లు పెడితే మళ్లీ అది ఎదిగి, వరి కంకులు వేస్తున్నది.
ఇప్పటికే చైనా రైతులు 40 వేల ఎకరాల్లో సాగు చేయగా, దానిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దుక్కి, వరినాట్లకు అయ్యే ఖర్చులతోపాటు నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతున్నది. సాగు నీటి వాడకం 60%, కూలీల ఖర్చు 58%, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వ్యయం 49% వరకు కలిసి వస్తున్నదని చైనా పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో పీఆర్-23 వంగడం మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలమో.. కాదో తేల్చేందుకు అధ్యయనం చేయాలని భారత వ్యవసాయ పరశోధనా మండలి(ఐసీఏఆర్) దేశంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఆదేశించింది. ఐసీఏఆర్ సూచనల మేరకు రాజేంద్రనగర్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా అధ్యయనం చేస్తున్నది.
క్షుణ్ణంగా పరిశీలించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జగదీశ్వర్
భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉన్నదని, ప్రతి 4 నెలలకు ఒకసారి సీజన్ మారుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకుడు డాక్టర్ జగదీశ్వర్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయ ని, పంటలను తెగుళ్లు చుట్టుముడుతున్నాయని తెలిపారు. చైనా ఆహారపు అలవాట్లు, వాతావరణం భారతదేశానికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. మనం బియ్యంతో అన్నం వండుకుని తింటామని, చైనాలో హైబ్రిడ్ బియ్యం లేదా నూకలతో జావలా కాచి తాగుతారని వివరించారు. ఈ నేపథ్యంలో మనదేశ వాతావరణం, ఇక్కడి భూములు, ఆహార అలవాట్లు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే కొత్త వంగడాల సాగును అనుమతించాల్సి ఉంటుందని డాక్టర్ జగదీశ్వర్ పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment