యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి దగ్గర్లో ఉన్న రాయగిరి మెట్లబావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.
సుందరంగా తీర్చిదిద్దనున్న రాష్ట్ర ప్రభుత్వం
యాదాద్రికి వచ్చే భక్తులు సందర్శించేలా ప్రణాళిక
ఇప్పటికే పనులు షురూ
మెట్లబావి చుట్టూ పార్కు.. లైటింగ్ వ్యవస్థ
ఇక్కడే వేద, సాంస్కృతిక పాఠశాల
సర్కారుకు ప్రతిపాదనలు పంపించిన వైటీడీఏ
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి దగ్గర్లో ఉన్న రాయగిరి మెట్లబావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.
సర్కారు ఆదేశాలతో అధికార యంత్రంగా మెట్లబావి సుందరీకరణ పనులు చేపడుతున్నారు. దాంతో పాటు ఈ ప్రాంతంలోనే వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
వేద పాఠశాల.. శిల్ప కళాశాల
మెట్లబావి వద్ద నుంచి చూస్తే ఒకవైపు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ గోపురాలు, మరోవైపు గుట్టపై వేంకటేశ్వరస్వామి గుడి కనిపిస్తుంది. వైటీడీఏ అధికారులు ఈ ప్రాంతాన్ని తమ పరిధిలోకి తీసుకొచ్చారు. మెట్లబావి పరిసరాల్లో మొత్తం 17ఎకరాల స్థలం ఉంది.
ఈ ప్రాంతంలోనే వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు డిజైన్ కూడా రూపొందించారు. దాంతో పాటు శిల్పి కళాశాల ఏర్పాటు చేయనున్నారు.
సాంస్కృతిక పాఠశాల, అర్చక శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే నిర్మించాలని భావిస్తున్నారు. వీటన్నింటికీ అనుమతులు రాగానే అంచనాలు సిద్ధం చేయనున్నారు. మెట్ల బావి పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉండటం విశేషం.
పార్కు.. లైటింగ్ సిస్టం
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మెట్లబావులను తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతున్నది. ఇటీవల హైదరాబాద్‌లోని బన్సీలాల్ పేటలో ఉన్న మెట్లబావికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. రాయగిరి వద్ద ఉన్న మెట్లబావిని సైతం అందంగా తీర్చి దిద్దేందుకు చర్యలు చేపట్టింది.
ఇటీవల ఉన్నతాధికారులు మెట్లబావిని సందర్శించారు. బావిని సుందరీకరించాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. దాంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రగతి కింద ఈ పనులు చేపట్టనున్నారు.
మెట్లబావి వద్ద పార్కును అభివృద్ధి చేయనున్నారు. చుట్టూ ఫెన్సింగ్, లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు కల్పిస్తారు.
అద్భుతమైన నిర్మాణం
యాదగిరిగుట్టకు నాలుగు కిలోమీటర్ల దూరంలో రాయగిరి గుట్టపై వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. కింద మెట్ల వద్ద ఆళ్వార్ల బొమ్మలు చెక్కి ఉన్నాయి. పక్కనే ఆంజనేయుడు, ధ్వజస్తంభం, బావి, పద్మనాభస్వామి దేవాలయం ఉంది. ఈ నిర్మాణాలకు ఎదురుగా అందమైన మెట్ల బావి ఉంది. ఈ బావి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయనానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
బావి 16వ శతాబ్ధం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ బావి చతురస్రాకారంలో, బోర్లించిన పిరిమిడ్‌లా కనిపిస్తున్నది. బావి ప్రారంభంలో మంటపం ఉంది. గుట్ట ఉత్సవాల సమయంలో దేవుతామూర్తుల విగ్రహాలకు ఇక్కడే చక్రస్నానం చేయిస్తారు. కొనేరులో స్నానం, పూజలు చేసుకోవడానికి పక్కన చిన్న గుడి ఉంది. దాని పక్కన మల్లన్నగుట్ట గుడి ఉంది.
భువనగిరి ఖిలా కోట కంటే పెద్ద కోట ఉంటుంది. రైల్వే స్టేషన్‌కు దక్షిణ భాగంలో అనంతపద్మనాభస్వామి ఆలయం, ఆంజనేయ గుడి, నాలుగు ధ్వజస్తంభాలు, వాటిలో ఒకదానిపై వైష్ణవ మత గురువులు, మరొకదానిపై కూర్మం, సర్పం, ఆంజనేయుడు, ఇంకో స్తంభంపై భూదేవి లక్ష్మీసహిత, విష్ణుమూర్తి, గురుడ శిల్పాలు ఉన్నాయి.
ప్రభుత్వానికి వైటీడీఏ ప్రతిపాదనలు
యాదగిరిగుట్టకు వచ్చే భక్తులను ఆకర్షించేలా రాయగిరి వద్ద ఉన్న మెట్లబావిని అభివృద్ధి చేయనున్నారు. వేద పాఠశాల, శిల్ప కళాశాల, సాంస్కృతిక పాఠశాల, అర్చక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని వైటీడీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
పక్కనే వేంకటేశ్వరాలయం, సమీపంలోనే యాదాద్రి ఆలయం ఉండడంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
– గీతారెడ్డి, ఈఓ, యాదగిరిగుట్ట
సుందరీకరణ పనులు ప్రారంభం
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెట్లబావి వద్ద సుందరీకరణ పనులను ప్రారంభించాం. ఇప్పటికే చెత్త, కంపచెట్లు తొలగించాం. ఈ ప్రాంతంలో పార్కుకూడా ఏర్పాటు కానున్నది. హైమాస్ట్ లైట్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తాం. త్వరలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం.
– నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్
0 Comments:
Post a Comment