✍️టీచర్లకు ‘సర్దుబాటు’ కష్టాలు
🌻ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో మిగులు ఉన్న వారిని ఈ నెల 8లోపు అవసరమైన బడులకు సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6న ఉమ్మడి జిల్లాల కలెక్టర్ ఛైర్మన్‌గా సమావేశం నిర్వహించాలని సూచించింది. ఏ జిల్లాల్లో ఎంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.. అనే వివరాలను 8వ తేదీ లోపు పంపించాలని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,943 ఫౌండేషన్ ప్లస్, ప్రీహైస్కూళ్లను 3,557 ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లకు మ్యాపింగ్ చేశారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 3-10, 6-10 తరగతులకు ప్రతి సబ్జెక్టుకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండేలా సర్దుబాటు చేయనున్నారు. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయించేందుకు స్కూల్ అసిస్టెంట్లను నియమించనున్నారు. మిగులు సెకండరీ గ్రేడ్ టీచర్లను ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ బడులకు సర్దుబాటు చేస్తారు. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉంటే అర్హత ఉన్న ఎస్జీటీలను ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు సర్దుబాటు చేయనున్నారు. పోస్టుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు హేతుబద్ధీకరణ మాత్రమే పూర్తి చేసి, ఇప్పుడు పని సర్దుబాటు కింద ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపిస్తున్నారు. బదిలీలు చేపట్టకపోవడంతో పదోన్నతులు కల్పించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఒక మండలం నుంచి సమీపంలోని మండలానికి, ఒక డివిజన్ నుంచి సమీపంలోని డివిజన్‌కు సర్దుబాటు కింద ఉపాధ్యాయులను పంపించనున్నారు. బదిలీలు నిర్వహిస్తే ఉపాధ్యాయులు వారి సీనియారిటీ ప్రకారం కోరుకున్న ప్రాంతాలకు వెళ్తారు. కానీ, ఇప్పుడు అధికారుల ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
0 Comments:
Post a Comment