✍️టీచర్ల బదిలీల్లో కోర్టు వివాదాలు
♦️న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పలువురు
🌻ఒంగోలు (విద్య), డిసెంబరు 14: ఆదిలోనే హంసపాదులా ఉపాధ్యాయుల బదిలీల్లో కోర్టు వివాదాలు మొదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. స్థానాలు ప్రకటించే విషయంలో 2021 అక్టోబరులో ఉద్యోగోన్నతులు పొందిన హైస్కూలు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో వారి స్థానాలు ప్రకటించవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వారి బాటలోనే మరికొందరు హెచ్‌ఎంలు, ఎస్‌ఏలు హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందేందుకు క్యూ కడుతున్నారు. దీంతో బదిలీలకు స్థానాలు ప్రకటించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. టీచర్లు కూడా బదిలీల కోసం స్థానాలు ప్రకటించే విషయంలో 2021 అక్టోబరులో హెచ్‌ఎంలు, ఎస్‌ఏలుగా ప్రమోషన్ పొందిన నేపథ్యంలో తాత్కాలికంగా కేటాయించిన స్థానాలన్నింటినీ ప్రస్తుతం ఖాళీలుగా చూపించనున్నారు. ఉద్యోగోన్నతులకు జారీచేసిన నియామక ఉత్తర్వుల్లో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం అడ్‌హక్ పద్ధతిలో తాత్కాలిక స్థానాలు కేటాయిస్తున్నామని, తద్వారా వచ్చే బదిలీల్లో ఈ స్థానాలను ఖాళీగా ప్రకటిస్తామని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉద్యోగోన్నతులు పొందిన వారు ఏడాదికిపైగా ప్రస్తుత స్థానాల్లో పనిచేస్తున్నందున తమను అక్కడే కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఈ స్థానాలను ఖాళీగా చూపవద్దని ఆదేశించారు. కొత్తగా ప్రమోషన్ పొందిన భాషా పండితులు కూడా తాము ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగించాలని హైకోర్టును అభ్యర్థించారు. వారికి కూడా అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
0 Comments:
Post a Comment