SSY: 'సుకన్య సమృద్ధి'తో ఎంత మొత్తం సమకూరుతుంది?
కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకమే సుకన్య సమృద్ధి యోజన (SSY). ప్రభుత్వ మద్దుతు గల పెట్టుబడి పథకం కాబట్టి నష్టభయం ఉండదు.
ప్రస్తుతం 7.60% వడ్డీ (Interest rate) ఇస్తోంది. 21 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. 10 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూమార్తెల ఉన్నత విద్య, వివాహం కోసం ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడులు పెట్టాలి. అయితే ఈ పెట్టుబడులు నెలవారీగా పెట్టాలా? వార్షికంగా పెట్టాలా? ఏవిధంగా పెడితే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు తెలుసుకుందాం..
పెట్టుబడులు ఎలా చేయాలి?
SSYలో ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలనేది పెట్టుబడిదారుని ఆర్థిక సామర్ధ్యం, నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. నెలనెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం బ్యాంకుకు నిర్దిష్ట సూచనలు కూడా ఇవ్వొచ్చు. లేదంటే ఏడాదికి ఒకేసారి ఏకమొత్తంగా జమచేయవచ్చు. లేదా మీ వెసులుబాటును అనుసరించి ఏడాదిలో ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు. అయితే, ఏడాదిలో గరిష్ఠ పరిమితి రూ. 1.50 లక్షలను మించి పెట్టుబడులు చేయకూడదు.
పెట్టుబడులు గరిష్ఠ పరిమితి దాటితే..
ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలను మించి పెట్టుబడులను చేసినా అదనపు మొత్తంపై వడ్డీ లభించదు.
ఒక ఏడాది పెట్టుబడి పెట్టకపోతే..
SSYలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఏదైనా ఏడాదిలో పెట్టుబడులు పెట్టలేకపోతే కనీస మొత్తాన్ని అయినా డిపాజిట్ చేయాలి. లేదంటే ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ పడుతుంది.
ప్రతి నెలా ఐదో తేదీ ముఖ్యం..
ప్రతి క్యాలెండరు నెల 5వ తేదీ నుంచి నెల ముగిసేనాటికి ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కిస్తారు. కాబట్టి నెల నెలా పెట్టుబడి పెట్టేవారు ప్రతి నెలా 5వ తేదీలోపు జమచేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నెలవారీగా పెట్టుబడితో ఎంత సమకూరుతుంది?
వార్షికంగా ఎంత పెట్టుబడి పెడితే ఎంత సమకూర్చుకోవచ్చు?
పైన పట్టికల్లో చూసినట్లయితే వార్షికంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు నెల నెలా రూ.12,500 పెట్టుబడి పెట్టినదానికంటే దాదాపు రూ.2 లక్షల వరకు ఎక్కువ సమకూర్చుకోవచ్చు. కాబట్టి మీ వద్ద సరిపడా మొత్తం ప్రతి ఏడాది ఉన్నట్లయితే వార్షిక పెట్టుబడి విధానాన్ని ఎంచుకోవచ్చు.
చివరిగా..
ఎస్ఎస్వైతో పెట్టుబడులకు భద్రత లభించడంతో పాటు మంచి రాబడి కూడా పొందొచ్చు. కాబట్టి 10 ఏళ్ల లోపు ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పాప కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.
0 Comments:
Post a Comment