ఇంటర్నెట్‌డెస్క్: ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది.
21వ శతాబ్దపు అతిపెద్ద సైన్స్ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్‌లో ఉంటుంది.
ఖగోళంలో అంతుచిక్కని అనేక అంశాలË గురించి తెలుసుకోవడానికి దీనిని వినియోగించనున్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలను ఇది పరీక్షించనుంది. భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషించనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు లక్షకు పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు.
ఇవి క్రిస్మస్ ట్రీలను పోలి ఉంటాయి. దక్షిణాఫ్రికాలో 197 భారీ డిష్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తాన్ని కలిపితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపు ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఇందులో 16 దేశాలకు భాగస్వామ్యం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా చాలా రేడియో, ఆప్టికల్ టెలిస్కోప్‌లు ఉన్నా.. ఎస్కేఏతో వాటిని పోల్చలేమని అధికారులు పేర్కొన్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన ఆలోచన 1990ల్లో వచ్చిందన్నారు.
2003లో ఈ ప్రాజెక్టుపై పనిచేయడం మొదలుపెట్టామని వివరించారు. విశ్వం ఆవిర్భావానికి కారణమైన 'బిగ్ బ్యాంగ్' అనంతరం తొలినాళ్లలో నెలకొన్న పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఈ భారీ టెలిస్కోప్ అవసరమన్నారు.
దీని నిర్మాణ పనులు వచ్చే ఏడాది నుంచి చురుగ్గా జరుగుతాయని భావిస్తున్నారు. 2028 నాటికి పూర్తవుతాయని అంచనా.
0 Comments:
Post a Comment