Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు.
Ricky Ponting: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ (47) కామెంటరీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెర్త్ లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచు మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చానెల్ 7లో రికీ పాంటింగ్ కామెంటరీ చేస్తున్నారు. అదే సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.
దీనిపై చానెల్ 7 ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. ''రికీ పాంటింగ్ ఆరోగ్యం బాగోలేదు. నేటి మ్యాచు కామెంటరీని కొనసాగించలేకపోతున్నారు'' అని చెప్పారు. పెర్త్ స్టేడియం నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. రికీ పాంటింగ్ అస్వస్థతకు గురైన విషయానికి సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. రికీ పాంటింగ్ కు ఏమైందని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలో పాంటింగ్ చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున 1995-2012 మధ్య ఆడిన రికీ పాంటింగ్.. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో ప్రపంచలోనే అత్యుత్తమ జట్టుగా ఆసీస్ కొనసాగింది. టెస్టుల్లో ఆయన మొత్తం 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 30 సెంచరీలు 82 హాఫ్ సెంచరీలు సాధించారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
0 Comments:
Post a Comment