ఉదయం లేవగానే.. ఒకటిన్నర లీటర్ల నీళ్లు తాగేస్తున్నారా? అయితే వెంటనే మానుకోండి.. ఎందుకంటే..
మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్‌లీ మరణించడానికి కారణం 'ఎక్కువగా నీళ్లు తాగడమే' అని తాజా అధ్యయనాల్లో తేలడం అందర్నీ ఆశ్చర్యపరచింది.
దాంతో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎన్ని గ్లాసుల నీళ్లు తాగితే మంచిది? అనే కొత్త చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే...
శరీరం సక్రమంగా పనిచేయడానికి తగినంత నీరు అవసరం. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల నీళ్లు తాగుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని ట్యాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయని అంటారు. కానీ ఇది సరియైున పద్ధతి కాదని అంటున్నారు నిపుణులు. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని సోడియం, పొటాషియం లెవెల్స్ డైల్యూట్ అయిపోతాయి. దీనివల్ల మెదడుపై ప్రభావం పడుతుంది.
నీళ్లు ఎన్ని లీటర్లు తాగాలన్నది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆ తేడా మనిషి మనిషికి వేరువేరుగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఎక్కడ, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? అక్కడి వాతావరణ పరిస్థితులు ఏంటి? చేసే వృత్తి ఏంటి? ఇలాంటి అంశాలన్నీ ఆధారపడి ఉంటాయి.
దాహం అయినప్పుడు మాత్రమే నీళ్లు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎక్కువ వర్కవుట్స్ చేసినా, చెమట ఎక్కువగా పోతున్నా అప్పుడు శరీరానికి నీళ్లు అవసరం అవుతుంది.
సాధారణంగా పురుషులకు 3.7 లీటర్ల నీళ్లు సరిపోతాయి. మహిళలైతే 2.7 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుంది.
ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. బ్రూస్‌లీ విషయంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు. పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సెరిబ్రల్ ఎడిమా(మెదడులో వాపు) వల్ల చనిపోయాడని గతంలో చెప్పారు. కానీ అసలు కారణం అది కాదని, నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల జరిగి ఉంటుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండటం, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే నీళ్లు ఎక్కువ తీసుకున్నట్టే.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు రక్తంలో ఉన్న సోడియంను కూడా డైల్యూట్ చేస్తాయి. ఫలితంగా కణాలు వాపునకు గురవుతాయి.
దాహంగా అనిపించినప్పుడు నీళ్లు తాగాలి. మూత్రం రంగు లేకుండా తెల్లగా వస్తుంటే తగినన్ని నీళ్లు తాగుతున్నట్టే.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చనిపోయిన సంఘటనలు చాలా అరుదు. అథ్లెట్లు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసే వాళ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు దాహం, మూత్రం రంగును గమనిస్తుండాలి.
0 Comments:
Post a Comment