ఎప్పుడైనా నీళ్ళలో మునిగిపోయినప్పుడో లేదా ఫోర్స్‌గా వస్తున్న నీళ్లు ముఖం మీద పడినప్పుడో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయపోతుంటాం.
కొంతమంది నీళ్ళలో ఫీట్లు చేస్తూ ఒకటి, రెండు, మూడు అని నెంబర్లు లెక్కపెడుతూ ఇక మనవల్ల కాదంటూ నిమిషానికే చేతులెత్తేస్తారు.
అయితే.. ఒకటి రెండు కాదు ఏకంగా 5 నుండి 13 నిమిషాల పాటు నీళ్ళలో ఉంటూ సముద్రానికి 200 అడుగుల లోతులో తిరిగే మనుషుల గురించి విన్నారా?? వీళ్ళు వింత మనుషులూ కాదు.. వేరే గ్రహం వారు అంతకన్నా కాదు. కానీ వీళ్ళ జీవితమే వేరు.
ఇంతకూ వీళ్ళెవరు? ప్రపంచ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్న వీళ్ల ఆరోగ్యరహస్యమేమిటి?? వంటి వివరాల్లోకి వెళితే..
ఫిలిఫ్ఫీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసించే తెగలలో బజౌ తెగ ఒకటి. ఈ తెగ సముద్రానికి 200 అడుగుల లోతున ఉంటూ తమకు కావలసిన సముద్ర ఆహారం కోసం వేట సాగిస్తుందట. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని మీదనే ఆధారపడి ఉన్నారట.
చదువు లాంటి సౌలభ్యాలు ఏమీ వీరి జాతి పిల్లలకు అందుబాటులో లేవు. ఇక్కడి పిల్లలు పుట్టి నడక నేర్చిన నాటి నుండి వీరికి ఇదే జీవితమట. ఈ ప్రాంత ప్రజలు భూమి మీద నివసించడానికి వీలులేకుండా నిషేధానికి గురయ్యారని కొందరు చెబుతారు.
దీని కారణంగా వీరి జీవితం మొత్తం సముద్రం నీటి మీదనే గడుస్తోందట. కొందరు నీటి ఉపరితలం మీద కర్రల సహాయంతో తేలుతున్న ఇళ్ళను నిర్మించుకుంటే మరికొందరు పడవల్లో నివసిస్తూ జీవితం సాగిస్తున్నారు. వీళ్లు నీటిలో కూడా ప్రతిదాన్ని ఎంతో స్పష్టంగా చూడగలుగుతారట.
వీళ్ల కంటిచూపు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉందని.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరిలో ప్లీహ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉందని ఈ తెగ ప్రజల గురించి గురించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
పలు దేశాలకు చెందిన మత్సకారులు సముద్రాలలో చేపలు పట్టడానికి కొత్తరకం పద్ధతులు ఉపయోగించడం వల్ల వీళ్లకు ఆహార భద్రత లేకుండా పోయిందట. ఈ కారణంగా వీరి తెగ మనుగడకు ప్రమాదం ఏర్పడిందట.
వీళ్లు నీటిలో ఆహారం కోసం వేటాడుతున్నప్పుడు శరీరంలో ఒత్తిడి పెరిగి రక్తప్రసరణలో మార్పు చోటుచేసుకుంటుందట. ఈ మార్పు వల్ల వీళ్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా చాలా సమర్థవంతంగా తయారవుతోందని చెబుతున్నారు.
వీళ్లకంటూ సొంతదేశం కానీ, సొంత ప్రాంతం కానీ ఏదీ లేదు. సముద్ర నీటి ఉపరితలం మీద జీవించడం, సముద్రంలో వేటసాగించి ఆహారాన్ని సంపాదించుకోవడమే వారికి తెలిసిన పని. ఈ జాతి పిల్లలు చాలా వరకు చిన్నప్పటి నుండే నీటితో అనుసంధానమైపోయి పెరుగుతారట.
సముద్రపు నీళ్లలో వీరి కదలిక షార్క్ చేపలు ఈదినట్టే ఉంటాయని వీరి గురించి పరిశోధన చేసిన వాళ్లు చెబుతున్నారు. వీళ్ల లాలాజలాన్ని సేకరించిన శాస్త్రవేత్తలు సాధారణ ప్రజలకంటే.. ఈ తెగ ప్రజల రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరొక ముఖ్యవిషయం ఏమిటంటే.. ఈ బజౌ జాతి ప్రజలలో ప్లీహము 50శాతం పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మానవ శరీరంలో పొత్తికడుపు వెనుక భాగంలో సుమారు 150 గ్రాముల బరువు ఉండే ఈ ప్లీహము రెండు రక్తనాళాలు కలిగి ఉంటుంది. వీటిలో ఒక దాంట్లో ఆక్సిజన్ నిండిన రక్తం సరఫరా అయితే మరొక దాని నుంచి ఆక్సిజన్ లేని రక్తం బయటకు వెళ్ళిపోతుంది.
శరీరానికి వైరస్ అటాక్ అయినప్పుడు ప్లీహంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ వైరస్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఈ కారణంగానే వీరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.
వీరిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తున్నారు. వింతగా ఉండే ఈ సాగర ప్రజల కథనం నెట్టింట వైరల్ అవుతోందిప్పుడు.
0 Comments:
Post a Comment