No salaries: జీతాలేవి జగన్!?
అప్పు పుట్టలేదు.. జీతాలు పడలేదు
ఐఏఎస్‌ల నుంచి అటెండర్ వరకు..
సచివాలయ శాఖల్లోనూ భారీగా పెండింగ్
జీతాలు 2100 కోట్లు, పెన్షన్లు 800 కోట్లు బాకీ
ఏరోజుకారోజు ఉద్యోగుల ఎదురు చూపులు
మంగళవారం అప్పు పుట్టక ఆపసోపాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి):సర్కారుకు అప్పు పుడితే జీతం! లేదంటే... అంతే సంగతులు! ఇవీ... ప్రభుత్వ ఉద్యోగుల వెతలు! వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు 'సీరియల్' కొనసాగుతోంది. ప్రతినెలా 15వ తేదీ దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఈనెల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఒకటో తేదీ పోయి వారమవుతున్నా... ఇంకా రూ.2100 కోట్ల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏకంగా సచివాలయంలోని కొన్ని శాఖల సిబ్బందికీ జీతాలు పడలేదు. ఆ శాఖల్లో ఐఏఎ్‌సల నుంచి అటెండర్ల వరకు జీతాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం పెన్షన్లపై ఆధారపడే రిటైర్డ్ ఉద్యోగులకు రెండు మూడు తేదీల్లోనే పెన్షన్లను చెల్లించడం రివాజు. వారికి కూడా రూ.800 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఈనెల 1న జీతాలు, పెన్షన్ల రూపంలో రూ.2,600 కోట్లు చెల్లించారు. మరుసటి రోజున తమకూ జీతాలు పడతాయని మిగిలిన ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. రోజులు గడుస్తున్నా అందకపోవడంతో ఖజానాలో డబ్బుల్లేవని అర్థమెంది. 'ఎప్పట్లాగానే మంగళవారం అప్పు తెచ్చి జీతాలు ఇస్తారులే' అని ఆశగా ఎదురు చూశారు. అది కూడా జరగలేదు. ఈ మంగళవారం ప్రభుత్వం అప్పు తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే... ఇప్పటికే రుణ పరిమితి దాటడంతో, కొత్త అప్పు పుట్టలేదు. ప్రతి నెలా 8వ తేదీన కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.900 కోట్లు వస్తాయి. కనీసం వాటితోనైనా వేతనాలిస్తారా? లేక ఇతర అవసరాలకు మళ్లిస్తారా? అనే సందేహాలు ఉద్యోగులను వేధిస్తున్నాయి.
వచ్చిన డబ్బులు ఏమైనట్లు?
గత నెల 29వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.1500 కోట్లు అప్పు తెచ్చారు. ఆ మరుసటి రోజునే ఓ కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని బ్యాంకు ద్వారా రూ.2000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఐజీఎస్టీ రూపంలో కేంద్రం నుంచి మరో రూ.1500 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. అంటే... జీతాలిచ్చే సమయానికి ఖజానాలో రూ.5వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రూ.1500 కోట్లు సామాజిక పెన్షన్లకు వినియోగించారు. ఇంకా రూ.3,500 కోట్లు మిగిలాయి. దీనినంతా పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్ల చెల్లింపునకు ఉపయోగించలేదు. వేరే అవసరాలకు వాడేసి, కేవలం సగం మంది ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇచ్చారు. ఇదంతా.. అప్పులు, ఐజీఎస్టీ రూపంలో వచ్చిన ఆదాయం లెక్క! మరి... ప్రభుత్వానికి ఇతర మార్గాల్లో వస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయన్నది మరో ప్రశ్న! నిరుడు ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.12,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే రోజుకు సగటున రూ.425 కోట్లు. ఈ ఏడాది అది మరింత పెరిగింది. మరోవైపు... ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9నెలల్లోనే ప్రభుత్వం రూ.70,000 కోట్ల అప్పులు చేసింది. ఓ వైపు ఆదాయమున్నా, మరోవైపు అప్పులు భారీగా చేస్తున్నా జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు.
బిల్లులన్నీ గొల్లు!
8 నెలల్లో 45,000 కోట్లు పెండింగ్
కోర్టుల్లో 2 లక్షలకుపైగా కేసులు
ఆర్బిట్రేషన్‌తో చెల్లు పలికే యోచన
అటు జీతాలు, పెన్షన్లే కాదు.. ఇటు పెండింగ్ బిల్లులూ చెల్లించలేకపోతున్నారు. సరికొత్తగా అమలు చేస్తున్న సంక్షేమమూ ఏదీ లేదు. మరి డబ్బులన్నీ ఏం చేస్తున్నారనేదే ప్రశ్న. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన బిల్లులు రూ.45,000 కోట్లు. ఇందులో రూ.30,000 కోట్లు నేరుగా బడ్జెట్ నుంచి చెల్లించాల్సినవి. మరో రూ.15,000 కోట్లు పీడీ ఖాతాల నుంచి చెల్లించాలి. ఇవి కాకుండా గడచిన మూడేళ్ల నుంచి ప్రతి ఏటా సగటున రూ.40,000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం రద్దు చేస్తూ వస్తోంది. అంటే మూడేళ్ల 8 నెలల కాలంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1,65,000 కోట్లు ఉంటాయని అంచనా. ఈ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కోర్టుల్లో 2 లక్షల కేసులు దాఖలయ్యాయి. వీటిని చెల్లించడం అసాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బెడదను తప్పించుకునేందుకు కేసులన్నిటినీ ఆర్బిట్రేషన్‌కు పంపి... ఏళ్లకేళ్లు వాటిని వాయిదా వేయాలని భావిస్తోంది. ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పులుండే అవకాశం ఎక్కువ. కాబట్టి, తాము మళ్లీ సివిల్ కోర్టు, అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్లక తప్పదని బిల్లుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment