Kendriya Vidyalayas Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో 14 వేలకు పైగా ఖాళీలు, ఈ రాష్ట్రాల్లోనే అధికం!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 14 వేలకు పైగా బోధన, బోధనేతర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉండగా..
తమిళనాడులో 1,220, కర్ణాటకలో 1,053, పశ్చిమబెంగాల్‌లో 1,043 చొప్పున ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. సిక్కింలో కేవలం 12 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలను వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానమిచ్చారు.
కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తంగా 14,461 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇప్పటికే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని.. నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేశారు. విద్యార్థులకు బోధన- అభ్యాస ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు కేవీల ద్వారా తాత్కాలికంగా ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించినట్టు తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాలకు నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవలే 13,404 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉండగా; 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలవారీగా ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలున్న అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment