Kapu Reservation Bill: కాపులకు గుడ్‌న్యూస్!.. కేంద్రం కీలక ప్రకటన...
న్యూఢిల్లీ: కాపుల రిజర్వేషన్ బిల్లుపై (Kapu Reservation Bill) కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు (Chandrababu) సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వం (TDP Govt) కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టబద్ధమేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో (AP Assembly) చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందని క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ (Pratima Bhoumik) ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని వివరించింది.
అయితే 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారుచేసుకోవచ్చునని కేంద్రం పేర్కొంది. మరోపక్క 103వ రాజ్యాంగ సవరణ చట్టం -2019 ద్వారా రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని ప్రస్తావించింది. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం అవసరం లేదని, కేంద్రం పాత్ర ఏమీలేదని బుధవారం ఇచ్చిన సమాధానంలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది. కాగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది. తాజాగా కేంద్రం చేసిన ఈ ప్రకటన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే..కాపు రిజర్వేషన్ బిల్లుపై ఇంతవరకు కోర్టులు, కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందంటూ చెప్పుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఇక మీదట ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
0 Comments:
Post a Comment