Inspiration ఉదయం ఉపాధ్యాయుడు.. రాత్రి కూలీ..
బ్రహ్మపుర బజారు, : ఆయన పేద విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తారు. అందుకోసం పగలు ఉపాధ్యాయుడిగా, రాత్రి రైల్వే కూలీగా పనిచేస్తున్నారు.
ఆయనే ఒడిశాలోని గంజాం జిల్లా మనోహర్ గ్రామానికి చెందిన సీహెచ్ నాగేశ్ పాత్ర్. కొన్నేళ్ల క్రితం పదోతరగతి మధ్యలో ఆపేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లినా.. అక్కడ సరైన ఉపాధి లేక తిరిగి సొంతూరు చేరుకున్నారు. రైల్వేకూలీ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకోవడంతో ఉద్యోగం సాధించారు. మళ్లీ చదువుపై ఆసక్తి కలగడంతో పని చేసుకుంటూ.. పీజీ వరకు చదువుకున్నారు. రెండేళ్ల క్రితం కరోనా విజృంభించి రైళ్లు నిలిపివేయడంతో ఖాళీగా ఉన్న నాగేశ్.. పేద పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించారు. కొణిసి అనే గ్రామంలో శిక్షణ కేంద్రం తెరిచి చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. కొవిడ్ విజృంభణ తగ్గి మళ్లీ పనికి వెళ్తుండటంతో చిన్నారులకు బోధించడం కష్టమయ్యేది. కేంద్రంలో ఆరుగురిని నియమించి, వారికి జీతాలు ఇచ్చేందుకు ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కళాశాలలో బోధన, రాత్రి 8 గంటల నుంచి స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడమే తన లక్ష్యమని 'న్యూస్టుడే'కు వెల్లడించిన నాగేశ్, శిక్షణ కేంద్రాన్ని ఇంకా విస్తరించాలని, మరింతమంది పేదలకు విద్యనందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
0 Comments:
Post a Comment