కడప - బెంగుళూరు రోడ్డు (నేషనల్ హైవే 340)మీద రాయచోటి పట్టణానికి 7 కి. మీ ముందు ‘ప్రేమాలయం’ అని ఎత్తయిన రెండు పిల్లర్ల మీద ఒక బోర్డు కనబడుతుంది.
మన చూపుని తన వైపు తిప్పుకునేంత ఆకర్షణీయమైన బోర్డు కాదది. దానికి తోడు ఎత్తయిన చెట్ల బ్యాక్ డ్రాప్. అందువల్ల హైవే మీద వేగంగా దూసుకు పోతున్న చాలా మంది ఈ బోర్డును గమనించే అవకాశం లేదు. నిఘాగా గమనిస్తేనే ఈ బోర్డు కనిపిస్తుంది. ఒక వేళ కనిపించినా ఆ పేరు చూస్తే అదేదో మిషనరీ సంస్థ అని అనుకునే ప్రమాదం ఉంది. లేదంటే ఏదో కాలేజ్ అనుకోవచ్చు. బోర్డు వల్ల దాని వెనక జరుగుతున్న కార్యకలాపాలు అర్థం కావు. బోర్డు దగ్గిర ఆగి, గేటు దాటుకుని నాలుగు అడుగులు లోపలికీ వేస్తే గాని అసలు విషయం అర్థం కాదు.
లోనికి వెళ్లారా మీరొక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్లే. దట్టంగా పెరిగిన ఎత్తయిన చెట్లు, వాటి మధ్య ఒక ఆలయం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పెద్దగా జన సంచారం ఉండదు. ఆరోగ్యకరమైన ఆశ్రమ ప్రశాంతి అక్కడ చూడవచ్చు. ఇది నిజంగానే ఒక ఆశ్రమం. ఈ ప్రాంతానికి చెందిన చింతం వెంకట రెడ్డి అనే వితరణశీలి 2007లో నిర్మించిన వృద్ధాశ్రమం.
కరువు కాటకాలతో అలమటించే రాయలసీమ ప్రాంతానికి చెందిన, ముఖ్యంగా నాటి కడప జిల్లా రాయచోటి పరిసర ప్రాంతానికి చెందిన నిరుపేద, నిరాశ్రయ వృద్ధలకు ప్రేమతో ఆశ్రయం కల్పించి, గౌరవ ప్రదమైన జీవితం అందించేందుకు ఏర్పాటు చేసిన ఆశ్రమం.
ఇక్కడ ప్రేమాభిమానాలకు పెద్ద పీట వేయాలనుకున్నారుకాబట్టి ఈ ఆశ్రమానికీ ‘ప్రేమాలయం’అని పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వాతావరణంలో, ఇంతచక్కగా నడుపుతున్న వృద్ధాశ్రమాలు లేవనే చెప్పాలి. ఒకవేళ ఉంటేగింటే ప్రేమాలయం పేరు మొదట చెప్పుకోవలసి ఉంటుందేమో.
చింతం వెంకటరెడ్డి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నాయకుడు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. పదవీ విరమణ చేశాక ఆయన మనసు ఈ ప్రాంత పేదల, వృద్ధుల వైపు మల్లింది. ఆయనకు వచ్చిన ఆలోచన ఇది. “పేదరికానికి తోడు, పనికి సహకరించని శరీరం, పట్టించుకోని కుటుంబం, ఆదరించని సమాజంలో ఆకలి తీర్చేవారు, ఆశ్రయం ఇచ్చేవారు లేక, ప్రేమానురాగాలు పంచేవారు లేక జీవితం కన్నా మరణమే మేలని భావించే వృద్ధులు మన సమాజంలో నానాటికి పెరుగుతున్నారు. వారి జీవితాలకు ఆసరా చాలా అవసరం. అదే సమయంలో ప్రగతి పేరుతో గతి తప్పిన మన జీవితాలకు ఒక పరమార్థం కూడా అవసరం.”
ఈ పరమార్థాన్ని వెంకటరెడ్డి ఆచరణలో పెట్టాలనుకున్నారు. ఆ ఆలోచన కార్య రూపమే ‘ప్రేమాలయం’ అందమైన, ఆహ్లాదకరమైన వృద్ధాశ్రమం. 2020 ఏప్రిల్ 20న వెంకటరెడ్డి చనిపోయారు. ఆనంతరం కూడా ‘ప్రేమాలయం’ ఆయన ఆలోచనల ప్రకారం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం వృద్ధాశ్రమం అంతే నిబద్థత ఉన్న వెంకటరెడ్డి మిత్రుడు అన్నగారి సుబ్బయ్య నిర్వహిస్తున్నారు. మూడేళ్ల కిందట స్వచ్ఛంద సేవగా వృద్ధాశ్రమం బాధ్యతలు స్వీకరించిన సుబ్బయ్య గురించి కూడా నాలుగు ముక్కలు ఇక్కడ చెప్పుకోవాలి.
సుబ్బయ్య పూర్వం కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత సిల్వర్ జూబిలీ డిగ్రీ కాలేజీకి వెళ్లారు. ఆ పైన శ్రీశైలం డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. ఆ రోజుల్లో సుబ్బయ్య బాగా పేరున్న ఫిజిక్స్ లెక్చరర్. విద్యార్ధుల్లో చాలా పాపులర్. వెంకటరెడ్డి, సుబ్బయ్య చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఆ అనుబంధం వల్లే తాను అనారోగ్యంతో ఉన్నపుడు వెంకటరెడ్డి వృద్ధాశ్రమం బాధ్యతలను సుబ్బయ్యకు అప్పగించారు.
ఏ చక్కటి ప్రైవేటు కాలేజీ హాస్టల్ కు తీసిపోని విధంగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. రూమ్ కు ఇద్దరు మాత్రం ఉండేలా ఏర్పాటు ఉంది. ప్రతిరూమ్ కు బాత్ రూమ్ వసతి ఉంది. రెండస్తుల హాస్టల్ భవనం ఇది. ఉండేది వృద్ధులు కాబట్టి పరిసరాలను వాళ్లకి అనుకూలంగా మార్చారు. లిఫ్టు సౌకర్యం కూడా వుంది. వరండా, పరిసరాలు చాలా శుభ్రంగా ఉంటాయి. కాలక్షేపానికి వరండాలో టివి లు ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమాన్ని ఐదు ఎకరాలలో ఏర్పాటు చేశారు.
వృద్ధాశ్రమం రాయచోటి పట్టణానికి ఏడు కి.మీ దూరాన ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనపుడు వైద్యం అందించేందుకు పక్క గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ తక్షణ సాయం అందిస్తూ ఉంటుంది. వృద్ధాశ్రమం ఈ మధ్య బాగా పాపులర్ అయినందున చాలా మంది ఇంట్లో శుభకార్యాలు జరిగినా, పూర్వీకుల స్మారకార్థం వృద్ధాశ్రమంలో ఉన్న వారికి బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం స్పాన్సర్ చేస్తుంటారు. వృద్ధాశ్రమం నిర్వహణ గొప్పగా ఉండటం స్పాన్సర్లు సమృద్ధిగా వస్తున్నారు. వృద్ధాశ్రమానికి బాగా గుడ్ విల్ వుండటంతో కాలేజీల ఎన్ ఎస్ ఎస్ వలంటీర్లు కూడా ఆశ్రమంలో శ్రమదానం చేస్తూ ఉంటారు.
వృద్ధాశ్రమమే కాదు, డైనింగ్ హాల్ కూడా చాలా శుభ్రంగా,ఆరోగ్య కరంగా ఉంటుంది. డైనింగ్ హాల్ గోడ మీద రోజువారీ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ కార్డు తగిలించారు. ఏ వెరైటీ ఒక వారంలో రిపీట్ కాదు. వృద్ధాశ్రమంలో పేదలతో పాటు కుటుంబాల సపోర్టు లేని రిటైర్డు ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్లు మాత్రం నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీరు కూడా డైనింగ్ హాల్ లో అందరితో పాటు భోజనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి వ్యత్యాసం పాటించరు.
అందరికి ఒకే భోజనం. బ్రెక్ ఫాస్టు, మధ్యాహ్నం, రాత్రిభోజనాలకు బెల్ మోగిస్తారు. అంతా డైనింగ్ హాల్ కు రావలసి ఉంటుంది. శుభ్రంగా,ఆరోగ్య కరంగా ఉండే టేబుళ్ల మీద శుచిగా, రుచిగా ఉండే భోజనం వడ్డిస్తారు. ఇక స్పాన్సర్లు వచ్చినపుడల్లా ప్రత్యేక భోజనం ఉంటుంది. దాతలు ఎంచుకున్న ప్రత్యేక దినాన వృద్ధాశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భోజనశాల భోర్డు మీద, ప్రేమాలయం వెబ్ సైట్ లో దాతల సమాచారం ప్రకటిస్తారు పూజ. అన్నదాన కార్యక్రమాన్ని లఘు వీడియో చిత్రం తీసి దాతలకు అందిస్తారు.
వృద్ధాశ్రమ వాసుల మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహిస్తుంటారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా వృద్ధాశ్రమం యధావిధిగా సాగిందని సుబ్బయ్య చెప్పారు. “వృద్ధాశ్రమంలోకి ఎవరినీ రానీయలేదు. ఇక్కడి నుంచి ఎవరినీ బయటకు వంపలేదు, ఆశ్రమం తోటలో పండించిన కూరగాయలతోనే భోజనశాల నడిచింది. కోవిడ్ కాలంలో ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడ్డాము,”అని సుబ్బయ్య చెప్పారు.
వృద్ధాశ్రమానికి బాగా డిమాండ్ ఉందని, దాతల సహకారంతో మరొర అంతస్తు వేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
0 Comments:
Post a Comment