ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ ఎన్నిక(Gujarat Election2022)ల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్(Congress) పార్టీకి హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో ఘన విజయం కాస్త ఊరట కల్పిస్తోంది.
ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చే సంప్రదాయాన్నే హిమాచల్ ఓటరు ఈసారి కూడా కొనసాగించాడు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో హోరాహోరీగా కొనసాగిన పోరులో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సీట్లు సాధించి ఎత్తైన మంచుకొండల్లో పార్టీ జెండాను రెపరెపలాడించింది.
వీరభద్రసింగ్ లాంటి నేత కన్నుమూతతో కాంగ్రెస్‌ను నాయకత్వ లోపం వెంటాడుతున్నా తనదైన శైలిలో ప్రచారం చేసిన కాంగ్రెస్ హిమాచల్‌ను వశం చేసుకోగలిగింది. మోదీ-అమిత్ షా ప్రచారం చేసి 'డబుల్ ఇంజిన్ ప్రభుత్వం' నినాదాన్ని పదే పదే వినిపించినా అక్కడి ఓటర్లు తిరస్కరించడానికి కారణాలేంటి? కాంగ్రెస్ గెలుపునకు దోహదపడిన అంశాలేంటో ఓసారి పరిశీలిస్తే..
ట్రెండ్ మార్చని ఓటర్లు
ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఈసారి కూడా తమ విలక్షణ తీర్పునే కొనసాగించారు. గత సంప్రదాయానికి అనుగుణంగానే విపక్షంలో ఉన్న ప్రధాన పార్టీకే అధికారం కట్టబెట్టారు.
గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న ఈ ట్రెండ్‌కు ఎండ్ కార్డు పడుతుందని కమలనాథులు ఆశించినా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకున్నాయనే చెప్పాలి.
మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 40 స్థానాల్లో విజయ దుందుభి మోగించగా.. భాజపా 25 సీట్లు, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆప్ ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
భాజపాకు యాపిల్ సెగ.. 1990నాటి సీన్ రిపీట్!
హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపాకు దాదాపు 30ఏళ్ల క్రితంలాంటి పరిణామమే ఎదురైంది. ఈసారి కూడా కమలనాథులకు 'యాపిల్' సెగ తగిలింది. హిమాచల్‌లో అధికారం నిలబెట్టుకొని చరిత్రను తిరగరాయాలనుకున్న భాజపాకు యాపిల్ రైతుల నుంచి అంతగా మద్దతులభించకపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది.
దేశంలో యాపిల్ పంటకు స్వర్గధామంలా నిలిచిన హిమాచల్ ప్రదేశ్‌లో ఏటా రూ.5వేల కోట్ల వ్యాపారం జరుగుతుండగా.. దాదాపు 20-25 అసెంబ్లీ సీట్లను ఈ వ్యాపారమే ప్రభావితం చేస్తుంటుంది.
అయితే, ఈసారి పెరిగిన జీఎస్టీకి వ్యతిరేకంగా యాపిల్ రైతులు, వ్యాపారులు ఆందోళనబాట పట్టగా.. ఆ అంశాన్ని కాంగ్రెస్ తనకు ఆయుధంగా మలచుకొని భాజపాను ఇరుకున పెట్టింది. దీంతో పెరిగిన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జైరాం ఠాకూర్ హామీ ఇచ్చినా భాజపాకు ప్రయోజనం లేకుండా పోయింది.
1990లో అప్పటి భాజపా సీఎం శాంత కుమార్ ప్రభుత్వాన్ని దించిన ఘనత కూడా యాపిల్ రైతులదే. కనీస మద్దతు ధర కావాలంటూ ఉద్యమబాట పట్టిన యాపిల్ రైతులపై భాజపా ప్రభుత్వం కాల్పులు జరపగా.. ముగ్గురు మృతిచెందారు.
దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అధికారం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోని అప్పటి సీఎం వీరభద్రసింగ్ యాపిల్ రైతుల డిమాండ్లను అంగీకరించడంతో అప్పటి నుంచి ఈ వర్గం పెద్దగా ఆందోళనలు చేసిందిలేదు.
పాత పింఛను విధానం..
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పాత పింఛను విధానం(ఓపీఎస్)ను అస్త్రంగా మలచుకుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మాదిరిగా ఇక్కడ కూడా సీపీఎస్‌ను రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్‌ను తిరిగి పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీతో అక్కడి ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
దీనికితోడు మహిళలకు నెలకు రూ.1500ల చొప్పున ఆర్థిక సాయం చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించడంతో మహిళా ఓటర్లు కూడా 'హస్తం' పార్టీకి చేయూతగా నిలిచినట్టు అర్థమవుతోంది. ఉమ్మడిపౌరస్మృతి, యువతకు ఉద్యోగాల కల్పిస్తామంటూ భాజపా హామీలు ఇచ్చినా అవేవీ ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి.
భాజపాలో అంతర్గత పోరు
భాజపాకు ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లాంటి బలమైన నేతలున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోవడం, పలువురు అభ్యర్థులు తిరుగుబాటు చేయడం వంటి పరిణామాలు కమలనాథుల విజయావకాశాల్ని దెబ్బతీశాయి.
క్షేత్ర స్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న భాజపా నాయకత్వం మోదీ పర్యటనతో ఈ అంతర్గత పోరు సమసిపోతుందని భావించినా అదేమీ జరగలేదని ఫలితాలే రుజువు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలు ఫలించడంతో విజయ తీరాలకు చేరగలిగింది.
కాంగ్రెస్‌లోనూ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్, సీఎల్‌పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్‌విందర్‌సింగ్ సుఖు, మాజీ మంత్రి సుధీర్‌శర్మలాంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం ఆ పార్టీకి సమస్యగా మారినప్పటికీ హిమాచల్‌లో నెలకొన్న పరిస్థితులే ఆ పార్టీకి ఆయాచిత వరంలా మారాయి.
నిరుద్యోగం, ధరల పెరుగుదల
హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్న నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మలుచుకొని లాభపడింది. తాము అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే లక్ష ఉద్యోగాలు కల్పించే అంశంతో పాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీ పట్ల హిమాచల్ ప్రజలు ఆకర్షితులైనట్టు అర్థమవుతోంది. క్షేత్ర స్థాయిలో ధరల పెరుగుదల అంశం కాషాయ దళానికి ఇబ్బందికరంగానే మారింది.
ప్రియాంకా గాంధీ ప్రచారం
భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటంతో హిమాచల్ ప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రియాంకా గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ అక్కడి మహిళా ఓటర్లను ఆకట్టుకోగలిగింది.
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌లతో కలిసి ప్రచార ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పన, ఓపీఎస్ అమలు వంటి వాటిని చూపించి అక్కడి సీఎంలతోనే ప్రత్యక్షంగా పరిస్థితులను వివరించడం ద్వారా హిమాచల్ ఓటర్ల మెప్పును పొందగలగడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
0 Comments:
Post a Comment