✍️‘దొడ్డిదారి’ బదిలీ జాబితాలు సిద్ధం
♦️సీల్డ్ కవర్లో పెట్టి డీఈఓలకు అందజేత
♦️సాధారణ బదిలీలకు ముందు ఇదేం తిరకాసు.. అంటున్న టీచర్లు
🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల ‘పైరవీ బదిలీలకు’ సంబంధించిన జాబితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి జిల్లా విద్యాధికారులకు పంపింది. ‘ప్రభుత్వ విచక్షణ బదిలీల’ పేరుతో జరిగే ప్రక్రియకు సంబంధించి టీచర్ల జాబితాను ఏ జిల్లాకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా వారికే రహస్యంగా సీల్డ్ కవర్లో పెట్టి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 140 మంది ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సులతో వీటిని చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరికి మంచి స్థానాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వమే దొడ్డిదారి బదిలీలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 140 మందిలో 70 శాతం మంది రాయలసీమ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ కారణంగా సాధారణ ఉపాధ్యాయులు పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోని స్థానాలను కోల్పోనున్నారు. బదిలీల్లో రాజకీయాలు చేయడం, పలుకుబడి కలిగిన వారికి కోరుకున్న స్థానాలు అప్పగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకాలం రహస్యంగా దస్త్రాన్ని కదిపిన పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగ్లు ఇచ్చేందుకు డీఈఓలకు జాబితాలను అందించారు.
♦️నేటి నుంచి పోస్టింగ్లు
ఒకవైపు సాధారణ బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు. ఎంతోకాలంగా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మంచి స్థానం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యాయ లోకం మండిపడుతోంది. పైరవీ బదిలీలు పొందినవారికి వారు కోరుకున్నచోట గురువారం నుంచి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. దీంతో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోని పాఠశాలల్లోని పోస్టులు చాలా వరకు భర్తీ అయిపోతాయి. ఆ తర్వాత సాధారణ బదిలీలు నిర్వహిస్తారు. అంటే ఎలాంటి రాజకీయ బలం లేనివారు దూరం ప్రాంతాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికితోడు కేటగిరి- 1, 2, 3లోని పోస్టులను బ్లాక్ చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన రాజకీయ అండలేని వారికి కష్టాలు తప్పనట్లే. 2020లో సాధారణ బదిలీలు చేసినప్పుడు 15,000 పోస్టులను బ్లాక్ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోనే ఉన్నాయి. దీంతో చాలామంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సిఫార్సు బదిలీలు, పోస్టులు బ్లాక్ చేయడం వల్ల కేటగిరి- 3, 4 బడుల్లోనే ఎక్కువమంది పోస్టింగ్లు పొందాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment