East india company , దొరల కాలంలో తిరుమల పాలన ఎలా ఉండింది?
ఈస్టిండియా కంపెనీకాలంలో తిరుమల తిరుపతి ఆలయాల పరిపాలన ఎలా ఉండింది? ఇది ఆసక్తికరమయిన ప్రశ్న. ఎందుకంటే, మొదటి సారి శ్రీవారి ఆలయం ప్రభుత్వం పరిపాలన కిందికి వచ్చింది అపుడే. అంతకు పూర్వం రాజ్యాలు మారినపుడల్లా తిరుమల తిరుపతి అలయాల చేతులు మారుతూ వచ్చి చివరకు ఆర్కాట్ నవాబుల చేతికి వచ్చింది. మద్రాసు చుట్టు పక్కల ఉన్నజిల్లాలన్నీ ఆర్కాటు జాగీరు. ఈ నవాబు మహమ్మద్ అలీ ఖాన్ వల్లజా నుంచి తిరుపతిని ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం తీసుకుంది. ఇదే తిరుమల ఆలయం మీద మొట్ట మొదటి ప్రభుత్వ అజమాయిషి. ఆసక్తికరమయిన విషయం ఏంటంటే విగ్రహారాధన ఉండే హిందూ ఆలయాలలో బ్రిటిష్ ప్రభుత్వ జోక్యం మంచిది కాదని భావించి ఆలయ పరిపాలన బాధ్యతలను ఈ ప్రభుత్వం హథీరామ్జీ మహంతుల చేతికి అప్పగించింది. ఆపైన మహం తుల నుంచి ఆలయ పాలన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డ్) కి వెళ్లింది. అదే విధానమే ఇపుడూ కొనసాగుతూ ఉంది.
తిరుమల చరిత్రలో ముఖ్యమైన సంవత్సరం క్రీ.శ 1801. ఆ ఏడాదే తిరుమల ఆలయం ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం పరిపాలన కిందికి వచ్చింది. 1801 జులై 31న ఆర్కాట్ నవాబునుంచి నెల్లూరు, సౌత్, నార్త్ ఆర్కాటు జిల్లాలుకంపెనీ పాలన కిందికి వచ్చాయి. అపుడు తిరుపతి నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉండింది. నార్త్ ఆర్కాట్ జిల్లా కేంద్రం చిత్తూరు. అలా తిరుపతి కంపెనీ వశమయింది. వీళ్లు మొదట చేసిన పని ఆలయ పాలన కోసం ఒక నియమావళి రూపొందించడం.
ఆర్కాట్ ప్రాంతాన్ని ఈస్టిండియా కంపెనీ ఎందుకు స్వాదీనం చేసుకుంది?
ఆర్కాట్ నవాబుకు మైసూరు నవాబు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు జరుగుతూ వచ్చిన యుద్ధాలలో కంపెనీ సైన్యాలు ఆర్కాట్ నవాబుకు సహకరించాయి. ఈ సైన్యాల ఖర్చు నవాబు భరించాలి. ఈ బకాయీ పేరుకు పోవడం తీర్చే మార్గం లేకపోవడంతో రాజ్యంలో పన్ను వసూలు చేసుకునేందుకు కొన్ని జిల్లాలను నవాబు కంపెనీకి అప్పచెప్పాడు. ఈ జిల్లాలతో పాటు అక్కడి గుళ్లు గోపురాలు కూడా కంపెనీ ఆదీనంలోకి వచ్చాయి. అందులో తిరుపతి, తిరుమల ఆలయాలు కూడా ఉన్నాయి
అప్పటికి ఆలయ పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండా ఉండింది. ఆలయ భూములు ఎక్కడ ఉన్నాయి, భక్తులు ఇచ్చే కానుకలు ఏమవుతున్నాయి, భక్తుల నుంచి ఎంత వసూలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏమి దోచుకుంటున్నారు ... వంటి వాటి మీద ఎవరికి అదుపు లేదు. ఇవన్నీ చక్కదిద్దితే గానీ దేవుడి ఆదాయం పెరగదు, దేవుడి ఆదాయం పెరిగితే గానీ తమ వాటా వసూలు కాదు. అందువల్ల ఆలయ పరిపాలనను సంస్కరించాల్సి వచ్చింది.
ఆలయభూముల ఎక్కడున్నాయి, ఎవరిచేతిలో ఉన్నాయి సర్వే చేయించి ఈస్టిండియా కంపెనీ వారు పునరుద్ధరించారు. ఆలయాలకు ప్రభుత్వం నుంచి కొంత వార్షిక సాయం కూడా అందిస్తూ వచ్చారు. ఆలయ సొమ్ముకాజేస్తున్నవాళ్లను ఏరిపారేశారు. తిరుమలలో మొదటి స్కాం బయటపెట్టి నేరస్తులను శిక్షించారు. ఆలయంలోపల జరిగే సంప్రదాయాలకు ఎట్టిపరిస్థితుల్లో ఆటకం కలిగించవద్దని కంపెనీ ప్రభుత్వం అప్పటి నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ ను ఆదేశించింది. ఆలయ పరిపాలనకు కొన్ని సూచనలు చేయాలని ఆయనను కంపెనీ ప్రభుత్వం కోరింది. ఈ నివేదిక ఆధారంగా అప్పటి చిత్తూరు కమిషనర్ బ్రూస్ ఆలయ పాలనకు 1813లో ఒక నియమావళి రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. ఇందులో ఆలయ పాలనకు సంబంధించిన 42 నియమాలున్నాయి. స్ట్రాటన్ కలెక్టర్ గా ఉన్నపుడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. తిరుమల ఆలయం చరిత్ర, సేవలు, ఆదాయం, నమ్మకాల గురించి ప్రజల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా తిరుపతి తాలూకా ఏర్పాటు చేశారు. తిరుపతి తాశీల్దార్ ని ఆలయం పాలకుడిగా నియమించారు. ఈ సమాచారం "సవాల్ ఇ జవాబ్ "గా ఉర్దులో వచ్చింది. దీనిని ఒకపుడు తిరుపతి తాహశీల్దార్ గా పని చేసిల వి. ఎన్ శ్రీనివాసరావు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు. తిరుమల గురించి అచ్చయిన తొలి పుస్తకం ఇదే.
తిరుమల, తిరుపతి ఆలయాలను కొన్ని నియమాల ప్రకారం నడిపేందుకు ప్రయత్నించి బాగు చేయాలనుకున్నది ఈస్టిండియా కంపెనీయే అని చరిత్ర పరిశోధకురాలు,‘ హిస్టరీ ఆఫ్ హిందూ రిలిజియస్ ఎండోమెంట్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’ పుస్తకం రచయిత్రి డాక్టర్ కౌతు నిర్మల కుమారి చెబుతున్నారు. ఇది మద్రాసు యూనివర్శిటీకి ఆమె సమర్పించిన పిహెచ్ డి పరిశోధనాత్మక గ్రంథం.
1805 జూలై 12 నుంచి 1810 ఫిబ్రవరి 28 మధ్యకాలంలో ఊగ్రాణం సోర్ట్స్ విభాగం ఇన్ చార్జ్ గా ఉన్నశీనప్ప, రామరావు అనే ఇద్దరు వ్యక్తులు గుడి నిధులను దుర్వినియోగపరిచినట్లు ఆరోపణలుఅందాయి. దీని మీద విచారణ జరిపించారు. ఈ విభాగంలో అక్రమాలు జరిగాయని తెలియగానే వారిద్దరిని కొలువు నుంచి కంపెనీ ప్రభుత్వం తప్పించిన విషయాన్న డాక్టర్ నిర్మలకుమారి ఉదహరించారు. ఇలాగే స్వామి వారి నగలను అర్చకులను పట్టుకున్నారు.
తిరుపతి వంటి ఆలయాలనుంచి అదనపు రాబడి రాబట్టుకున్నా, 1817లో ’రెగ్యులేషన్ 8‘ తీసుకువచ్చి దాని ప్రకారం సంప్రదాయ బద్దంగా తిరుపతి తో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ ఆలయ పాలన సాగేలా కంపెనీ చర్యలు తీసుకుందని డాక్టర్ నిర్మల కుమారి ఈ పుస్తకంలోరాశారు.
1843లో దాకా ఈ విధానం సాగింది. ఆయేడాది, తిరుపతి ఆలయ పాలనా వ్యవహారాలకు అధికారులు దూరంగా ఉండాలని కంపెనీ లండన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయించారు. ఏ విధంగా కూడా కంపెనీ అధికారులు హిందూ ఆలయాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని కంపెనీ ప్రభుత్వానికి ఇంగ్లండు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనితో ఆలయ పరిపాలన తటస్థ వర్గం అయిన హధీరామ్ జీ మఠానికి అప్పగించారు. ‘ఇస్టిండియా కంపెనీ కాలంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయంలో అక్రమాలు తగ్గాయి, ఆలయ నిధుల దుర్వినియోగం అవుతాయనే ప్రమాదం తక్కువయింది. ఆలయాల పాలన, పర్యవేక్షణలో ఒక పద్ధతి వచ్చింది. దీని వల్ల సర్వత్రా హర్షం వ్యక్త మయింది. ప్రజల మనసుదోచుకునేందుకు ఈస్టిండియా కంపెనీ తీసుకున్న మంచిచర్యల్లో ఇదొకటి,’ అని నిర్మలకుమారి రాశారు.
క్రమంగా ఆలయ పాలనని మఠానికి అప్పగించినా పరిపాలన తీరు మీద ఆరోపణలు రావడంతో 1933 లో మళ్లీ ప్రభుత్వ ఆదీనంలోకి వచ్చింది. ఈ లెక్కన ఈస్టిండియా కంపెనీ రోజుల్లో ఆలయ పాలన మెరుగ్గాసాగిందేమో అనిపిస్తుంది.అప్పటి నార్త్ ఆర్కాట్ కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ పాత్ర శ్లాఘనీయమని చెబుతారు. కంపెనీ ప్రభుత్వం పైనుంచి సూపర్వైజ్ చేయడమే తప్ప ఆలయ వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని కలెక్టర్ కు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అదీ సంగతి.
ఇటీవల టిటిడి మీద రాని ఆరోపణ లేదు. దీనికి కారణం రాజకీయ జోక్యమేనని చాలా మంది ఆరోపిస్తారు.
రాజకీయ నేతలను టిటిడి బోర్డు చీఫ్ గానియమించడం కొత్తకాదు. 1951లో టిటిడి యాక్ట్ ప్రకారం ఏర్పాటయిన తొలిబోర్డుకు ఛెయిర్మన్ వెంకటస్వామి నాయుడు ఎమ్మెల్సీ. అయితే, అదెపుడూ వివాదాస్పదం కాలేదు. 1951-1983 మధ్య టిటిడికి దాదాపు 16 మంది చెయిర్మన్ లయితే, అందులో వల్లియప్పన్ , సి అన్నారావు, ఎన్ రమేశన్, శ్రావణ్ కుమార్, ఎల్ సుబ్బయ్య, కె మురళీ ధర్ లు ఐఎఎస్ అధికారులు. ఈ పరిస్థితి 1983 దాకా కొనసాగింది. 1983 నుంచి పరిస్థితి మారింది. టిటిడి రాజకీయం అవుతూ వచ్చింది. ఈ పరిణామాల మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
1933 నాటి మద్రాసు చట్టంతో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన హధీరాంజీ మహంతులనుంచి ఒక కమిటీకి మారింది. అపుడు ఏడుగురుసభ్యులతో కమిటీ వేశారు. పదవీ కాలం మూడేళ్లు. ఇందులో ఒకరు అధ్యక్షుడు. ఈ వ్యవస్థ 1951 లో ‘మద్రాసు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండో మెంట్స్ చట్టం’ వచ్చేదాకా సాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుగురు అధ్యక్షులువచ్చారు. ఇందులో ఒకరు మహంత్. మిగతావారు, వెంకటరంగరాయన్, టి రామలింగమ్ చెట్టియార్, రఘునాథరెడ్డి, జి నారాయణ స్వామి చెట్టి, వెంకటస్వామినాయుడు లు పేరున్న నేతలే అయినా, వాళ్లు నియామకం ఎపుడూ వివాదం కాలేదు. 1951 చట్టం తో కమిటీ స్థానంలో ధర్మకర్తల మండలి వచ్చింది. ఇందులో కేవలం అయిదుగురే సభ్యులు. తర్వాత ఆంధప్రదేశ్ ఏర్పడటం,కొత్త చట్టం అవసరం వచ్చింది. 1966లో కొత్త టిటిడి చట్టం వచ్చింది. బోర్డు11 మంది సభ్యులకు పెరిగింది. అయితే, ఇందులో శాసన సభ్యులు ముగ్గురు మాత్రమే ఉండాలని, ఒక ఎస్ సి ,మరొకరు మహిళఉండాలనే నియమం అమలులోకి వచ్చింది. 1979 లో వచ్చిన టిటిడి చట్టం బోర్డును ఒక ఛెయిర్మన్, ఇద్దరు సభ్యులకు కుదించింది. ఈ చిన్న కమిటీ 1983 తర్వాత పెరిగి పెరిగి పెద్దవుతూ 2015 నాటికి 19 మందికి, 2021 నాటికి 82 కు చేరింది. ఇదెంత ఎంతవివాదం సృష్టించిందో చూశాం.
0 Comments:
Post a Comment