Death Day Invitation: బతికుండగానే మరణదిన వేడుకలు.. మాజీ మంత్రి ఆహ్వాన పత్రిక వైరల్
Paleti Ramarao Death Day Invitation: మరణం ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా సంభవిస్తుందో చెప్పలేం. కానీ ఓ వ్యక్తి మాత్రం ముందే తన మరణాన్ని ఊహించుకున్నారు.
అంతేకాదు బతికుండాగానే తన మరణదిన వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అతనికి ఏమైనా పిచ్చా అనుకుంటే మీరు పొరబడినట్లే. అతను ఓ మాజీ మంత్రి కూడా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన మరణ దినం పేరుతో ఆహ్వాన పత్రిక సిద్ధం చేసి అందరికీ పంపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీ హాయంలో మంత్రిగా పని చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. తాను 75 ఏళ్ల వయసులో అంటే 2034లో మరణిస్తానని చెబుతున్నారు. తన మరణానికి మరో 12 సంవత్సరాల సమయం ఉందని.. ఇప్పటి నుంచి 'మరణ దినం' నిర్వహించుకుంటున్నట్లు ఆహ్వాన పత్రిక సిద్ధం చేయించుకున్నారు. శనివారం చీరాల పట్టణంలో 12వ మరణ దినం వేడుకలు నిర్వహించుకునేందుకు ఆయన రెడీ అయ్యారు. వచ్చే ఏడాది 11వ ఏడాది వేడుకలు నిర్వహించుకుంటానని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక సోషల్ వైరల్‌గా అవుతోంది.
ప్రకాశం జిల్లాలో పాలేటి రామారావు సీనియర్ నేత. ప్రస్తుతం ఆయన అధికార వైఎస్సార్సీపీలో ఉన్నారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. 2004 జరిగిన ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా.. కొణిజేటి రోశయ్య చేతిలో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. 2009లో చిరంజీవి స్థాపించి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల అనంతరం చీరాల ఎమ్మెల్యే బలరాంతో కలిసి అధికార వైసీపీలో చేరిపోయారు.
భగవంతుడు ఎంత బోధించినా మానవుడు తన జీవన గమనాన్ని ఆలోచనా విధానాన్ని పూర్తిగా సరి చేసుకొనలేక పోతున్నాడని మాజీ మంత్రి పాలేటి రామారావు లేఖలో పేర్కొన్నారు. తాను ఎంత కాలం జీవించాలనుకుంటున్నానో ఆలోచించి.. మరణానికి ఒక తేదీని పెట్టుకున్నానని చెప్పారు. అది 2034గా నిర్ణయించుకున్నాని తెలిపారు. తాను మరో 12 ఏళ్లు జీవిస్తానని.. ఇక నుంచి ప్రతి ఏటా మరణదిన వేడుకలు నిర్వహించుకుంటానని తెలిపారు. చీరాల ఐఎంఏ హాల్లో నేడు ఉదయం 10 గంటల నుంచి జరిగే వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలో కోరారు. ఈ వేడుకలకు ఎంతమంది హాజరవుతారో చూడాలి మరి.
0 Comments:
Post a Comment