గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి, ప్రజాస్వామ్య ప్రియులైన పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామక ఫైల్‌ను సుప్రీం కోర్టు తెప్పించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.
గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి, ప్రజాస్వామ్య ప్రియులైన పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామక ఫైల్‌ను సుప్రీం కోర్టు తెప్పించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.
కానీ రాజ్యాంగ పీఠం ప్రదర్శించిన వైఖరి దేశమంతా అనుకూల సంకేతాలను పంపించింది. ఎన్నికల కమిషన్ వివాదాస్పద పనితీరును ప్రస్తావిస్తూ, 1990- 96 మధ్యకాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న టీఎన్ శేషన్‌ను సుప్రీం కోర్టు గుర్తు చేసింది.'దేశానికి టీఎన్ శేషన్ అవసరం' అని వ్యాఖ్యానించింది.
అరుణ్ గోయల్ నియామక ఫైళ్లను సుప్రీం కోర్టు తెప్పించుకోవడమంటే, కార్యనిర్వాహక శాఖ విధి నిర్వహణలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడమే అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉన్నది. కాని అది సరికాదు. పాఠకులకు ఇక్కడొక విషయం గుర్తు చేయదలుచుకున్నా. శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు, ఆయన సుప్రీం కోర్టు చేత చీవాట్లు తినవలసి వచ్చింది. నేను ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు చాలా కుంగిపోయి కనిపించారు.
ఆయన అహం దెబ్బతిన్నందున, నా భుజంపై తల వాల్చి కన్నీరు కార్చారు. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు కనుక, మీరు కోర్టుకు వెళ్ళడం ద్వారా నిరసన చెప్పవచ్చునని ఓదార్చాను. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు 'చెక్ అండ్ బ్యాలన్స్’ పద్ధతిలో నడుస్తాయంటూ ఆయనను న్యాయవాదులు ఒప్పించారు. మూల స్తంభాలలో ఏ ఒక్కటి బాధ్యతారహితంగా లేదా నిరంకుశంగా మారినా, పరిధిని అతిక్రమించినా ప్రజాస్వామ్య సౌధం బలహీనపడుతుంది.
శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వంటి సంస్థల నుంచి నియంత్రణకు తాము అతీతం కాదని ఈ ఉదంతం ద్వారా కార్యనిర్వాహక శాఖకు తెలువాలి.
ఎన్నికల కమిషనర్ల నియామకంలో పారదర్శకత ఉండాలని కోరుతున్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగ పీఠం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ తరహాలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలని ఈ పిటిషనర్లు కోరారు.
'సీబీఐ డైరెక్టర్ నియామకంలో ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యానికి ముప్పేమీ రాదు, పైగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తూ ఉంటుంది, ' అని ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు.
ఆయన 1997 నాటి 'వినీతి నారాయణ్’ తీర్పును ఉటంకించారు. ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలనే వాదనలో బలమున్నది.
ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పక్షాలతో వ్యవహరించే రాజ్యాంగ సంస్థయే తప్ప, కేంద్ర ప్రభుత్వ తోక సంస్థ కాదు కనుక ఈ డిమాండ్ హేతుబద్ధమైనది. ఎన్నికల కమిషనర్లను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తే, అధికార పక్షం వైపు మొగ్గేవారిని ఎంపిక చేసుకుంటుందనేది స్పష్టం.
శేషన్ ఏ వ్యవస్థలో మార్పు చేపట్టాలనుకున్నారో, ఆ వ్యవస్థనే ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. కానీ ప్రధాని చంద్రశేఖర్ నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అధికారం చేపట్టారు. అందువల్ల శేషన్‌కు సాహసోపేత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించింది. కేంద్రంలో శక్తిమంతమైన ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఇంత బలోపేతంగా ఉండకపోయేవారు.
శేషన్ రాకముందు ఎన్నికల కమిషన్ అనేది ఉందని, దానికి ఇన్ని అధికారాలు ఉన్నాయని సామాన్య ప్రజలకు తెలువకుండేది. శేషన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తీసుకున్న చర్యల వల్ల, ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠ అత్యున్నత స్థాయికి చేరుకున్నది. ఈ ఎన్నికల సంస్కరణలలో శేషన్ చేపట్టిన చరిత్రాత్మక పాత్రకు నా చిరకాల పాత్రికేయ సహచరుడు రజనీశ్ కపూర్, నేను ప్రత్యక్ష సాక్షులమే కాకుండా, అనధికారిక భాగస్వాములం. 1990 దశకంలో పోలింగ్ బూత్‌లు ఆక్రమించడం, ఎన్నికల హింసా పెచ్చరిల్లాయి.
రాజకీయాలలో గూండాలు, నేరస్థులు, మాఫియా పెరిగి ప్రజల మనసుల్లో ఆందోళన గూడు కట్టుకున్నది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి, వ్యవస్థ పట్ల నమ్మకం పెంచాలని శేషన్ నిర్ణయించుకొని ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు ప్రారంభించారు.
సంప్రదాయ అధికార యంత్రాంగం మౌలిక సంస్కరణలను సులభంగా చేపట్టనివ్వదని బీబీసీ సీరియల్ 'ఎస్, ప్రైమ్ మినిస్టర్’ ద్వారా చాలా మందికి తెలిసివచ్చింది. అందువల్ల శేషన్ 'దేశభక్త ట్రస్ట్’ అనే పరిశోధన- కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశారు. శేషన్ ఈ ట్రస్టుకు చైర్మన్ కాగా, ఆయన భార్య జయలక్ష్మీ శేషన్ సభ్యురాలు.
ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో ఉన్న మా కాలచక్ర న్యూస్‌బ్యూరో భవనం చిరునామాతో ట్రస్టును రిజిస్టర్ చేశారు. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన అంశాలను చర్చించడానికి శేషన్ తరచూ మా ఆఫీసుకు వచ్చేవారు. మీడియా పెద్దలు, ఉద్యమకారులు, మేధావులు, కొందరు ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు మొదలైన రంగాల వారు దేశం నలుమూలల నుంచి వచ్చి ఈ చర్చలలో పాల్గొనేవారు.
దీనికి తోడు శేషన్, నేను తరచు దేశమంతా తిరిగి సభలలో ప్రసంగించేవారం. ఎన్నికల సంస్కరణల గురించి అవగాహన పెంచడానికి నిష్ణాతుల బృందాలను ఏర్పాటు చేసేవారం. ఈ అవిశ్రాంత కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయి.
ఎన్నికల కమిషన్‌ను గట్టివాడే నడుపుతున్నాడనే అభిప్రాయం ఏర్పడింది. శేషన్ పెట్టిన కఠినమైన మార్గదర్శక సూత్రాల మూలంగా రాజకీయ పార్టీలలో అసహనం నెలకొని ప్రధానిపై కొంత ఒత్తిడి తెచ్చారు. శేషన్ సెలవుపై సతీసమేతంగా అమెరికా యాత్రకు పోయినప్పుడు, ప్రధాని పీవీ మరో ఇద్దరు ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించారు.
అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఏకసభ్య సంఘంగా ఉండేది. ఇప్పుడు ముగ్గురు సభ్యుల కమిషన్‌గా మారింది. శేషన్ నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి- 'పీవీ నన్ను మోసం చేశారు. నా మనసు గాయపడ్డది. ఇప్పుడు నేను ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి? నేను వచ్చే వారం వచ్చే లోగా ఆలోచించు' అన్నారు.
1993 జూలైలో జైన్ హవాలా కేసును చేపట్టినప్పటి నుంచి, రాజకీయ వ్యవస్థలో పారదర్శకత కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నా. శేషన్ విదేశాల నుంచి వచ్చిన తరువాత, తన ప్రతిష్ఠను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా మద్దతుదారులను ఏర్పాటు చేసి ఎన్నికల సంస్కరణలు తేవలసిందిగా సూచించాను.
ప్రతి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో ప్రజా ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేద్దామని చెప్పాను. ప్రతి ప్రాంతంలోనూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని, సమాజంలో గౌరవం గల వారు ఈ కమిషన్లలో సభ్యులుగా ఉంటారు. ప్రతి ఎన్నికల సందర్భంగా అప్రమత్తంగా ఉండి, ప్రజా జీవనంలో నైతికత, పారదర్శకత పెంపొందేలా చూడటం వీరి బాధ్యత. ఇందుకు మార్గదర్శకాలను రూపొందించాం. జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజా ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను కరపత్రాలుగా ముద్రించి దేశమంతా పంపిణీ చేశాము.
దీంతో అటువంటివి ఎన్నో పుట్టుకొచ్చాయి. శేషన్ ఇతర కమిషనర్లతో ఇబ్బంది పడుతున్నందున, ఆయన రాజీనామా చేసి 'భారత ప్రజా ప్రధాన ఎన్నికల కమిషనర్’గా ప్రకటించుకోవాలని సూచించాను. దీనివల్ల ఆయనకున్న పేరు ప్రతిష్ఠల మూలంగా ఎన్నికల సంస్కరణల కోసం ప్రజా ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చినట్టవుతుందని భావించాను. కానీ ప్రధాని పీవీ విధానం వల్ల మనసు గాయపడినప్పటికీ శేషన్ రాజీనామా చేయలేదు.
తన భద్రత, దేశమంతా తిరగడానికి అధికార హోదాలో లభించే సౌకర్యాల పట్ల ఆయన మక్కువ చూపించారు. దీనివల్ల మేం చేపట్టిన కార్యక్రమంలో పరిమితమైన ఫలితాలు సాధించాం. అయినప్పటికీ, ఆయన ప్రయత్నాలు ఎన్నికల కమిషన్‌కు గతంలో లేని ప్రతిష్ఠను తీసుకొచ్చాయి. ఎన్నికల కమిషన్‌ను ఉచ్ఛ స్థాయిలో నిలిపి భవిష్యత్తు ఎన్నికల కమిషనర్లకు ఆయన ఉన్నత ప్రమాణాలు నిర్దేశించగలిగారు.
ప్రతిపక్షాల నిరసనలను ఏమాత్రం పట్టించుకోని నేటి పిరికి ఎన్నికల కమిషన్ మూలంగా ఇప్పుడా ప్రతిష్ఠ మసకబారింది. ఇటీవలి చర్యల వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రతపైనే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. అందువల్లే 26 ఏండ్ల తర్వాత కూడా టీఎన్ శేషన్‌ను గుర్తుకు చేసుకోవలసి వస్తున్నది.
0 Comments:
Post a Comment