బోగస్ ఓట్లే పావులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహం
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ, బోగస్ ఓట్లు భారీగా నమోదయ్యాయి.
యూడైస్‌లో నమోదైన ఉపాధ్యాయుల సంఖ్య, ఓటర్ల నమోదుకు పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు వాలంటీర్లతో నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. ఈ ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని గ్రహించి అధికారం అడ్డుపెట్టుకుని వైకాపా పావులు కదుపుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించి గెలుపు బాటలు వేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాక బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించాలి. ప్రభుత్వ టీచర్లు విధులకు వెళ్లాక ఫోన్ చేసి స్పందించలేదన్న కారణం బూచీగా చూపి తిరస్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి 6,793, నంద్యాలలో 5,017 దరఖాస్తులు అందాయి. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలకు భిన్నంగా ప్రైవేటు యాజమాన్యాల నుంచి సుమారు 8 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
నంద్యాలలో మరీ ఎక్కువ
* 33 ఏళ్ల క్రితం నంద్యాలలో ఏర్పాటైన ఓ ప్రైవేటు పాఠశాలలోని 50 మంది ఉపాధ్యాయులకు ఓటు హక్కు లభించింది. ఈ పాఠశాల కరస్పాండెంట్‌తో చర్చించిన అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఓటర్లుగా చేరిపోయారు.
* నంద్యాల పట్టణం కాంతి నగర్‌లోని ఓ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఓటర్ల జాబితాలో చేరగా వీరు అధికారికంగా ఎక్కడా పీఎఫ్ కలిగి లేరు.
* నంద్యాల పట్టణం పాత పట్టణంలో వైకాపా నాయకుని పాఠశాలలో ఆరుగురికి ఓటు హక్కు వచ్చింది. అధికార పార్టీ సానుభూతిపరులైన ఓ కార్పొరేట్ పాఠశాల నుంచి ఎనిమిది మందికి, మరో పాఠశాల నుంచి నలుగురికి ఓటు హక్కు కల్పించారు.
ఆర్థిక మంత్రి ఇలాకాలో..
* బేతంచెర్లలో ఓ ఉపాధ్యాయుడికి ఏకంగా ఐదు ఓట్లు ఉన్నాయి. యూడైస్‌లో ఆయన పేరే లేకపోవడం గమనార్హం. ఇక్కడ 53 మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, 23 మంది ప్రభుత్వ (రెగ్యులర్) ఉపాధ్యాయులు ఉన్నారు. అనర్హులైన వారికి ప్రాధాన్యం కల్పించి రెగ్యులర్ టీచర్ల దరఖాస్తులు తిరస్కరించారు.
తప్పుల కుప్ప
* శ్రీశైలంలో 33 బోగస్ ఓట్లు గుర్తించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కోసమని చెప్పి సంతకాలు తీసుకెళ్లి ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదు చేయించారు. తమకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ ఓట్లు తొలగించాలంటూ 22 మంది అర్జీలు పెట్టుకున్నారంటే అధికార పార్టీ పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
* కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాలలో యూడైస్ ప్రకారం ఎనిమిది మంది ప్రాథమిక బోధన చేసే వారే ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి 17 మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం.
* కోడుమూరులో ఓ పాఠశాలను ఈ ఏడాది హైస్కూలుగా ఉన్నతీకరించారు. గతేడాది వరకు ప్రాథమికోన్నత పాఠశాల (యూపీ)గానే ఉంది. మూడేళ్ల సర్వీసు లేకపోయినా ఏడుగురు ఓటర్లుగా నమోదయ్యారు.
* నంద్యాలలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని ఓటరు జాబితాలో చేర్చారు. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నత తరగతులు నిర్వహించడం లేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉన్న ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో మూడేళ్ల సర్వీసుకు తగ్గకుండా పని చేసి ఉండాలి. ఆదాయ పన్నుతోపాటు ఈపీఎఫ్ సౌకర్యం, జీతభత్యాలకు సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్ వివరాలు పొందు పరచాలి. సదరు వ్యక్తి ఆరు నుంచి పది వరకు బోధించాలి.. 2022 నవంబరు ఒకటి నాటికి ఆరేళ్ల కాలంలో మూడేళ్లపాటు ఒకేచోట పని చేసి ఉండాలి. ఇవన్నీ నిర్ధారించిన తర్వాతే జిల్లా విద్యాశాఖాధికారి సంతకం చేయాల్సి ఉండగా ఇవేమీ పట్టించుకోలేదు. నకిలీ.. బోగస్ ఓట్లు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఏపీటీఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు.
గుడ్డిగా ఆమోదం
అధికార పార్టీ నేతలు కరస్పాండెంట్లతో చర్చించి సంబంధిత ఉపాధ్యాయుల జాబితా తీసుకుంటున్నారు. నంద్యాలలో రెండు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఏకంగా 1,080 ఓట్లు నమోదు అయ్యాయి. వారం రోజుల క్రితం నంద్యాలలో ఓ ప్రజాప్రతినిధి ప్రైవేటు పాఠశాలల యజమానులతో సమావేశం నిర్వహించి భారీ విందు ఇచ్చి బోగస్ ఓట్లు నమోదు చేయించారు. అధికార ఒత్తిళ్లకు తలొగ్గి ప్రైవేటు పాఠశాలల యజమానులు తీసుకొస్తున్న దరఖాస్తులు ఏమాత్రం పరిశీలించకుండా విద్యాశాఖాధికారులు సంతకం, సీల్ వేసినట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment