ఉచిత పథకాల వల్ల ఒక రాష్ట్ర ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉంది: `కొనసాగింపు`పై తేల్చేసిన కేంద్రం
దేశంలో కొనసాగుతున్న ఉచిత పథకాలు, సబ్సిడీలపై కేంద్ర ప్రభుత్వం తన మనసులో మాట బయటపెట్టింది. ఉచిత పథకాలు/సబ్సిడీలు దేశ ఆర్థిక వ్యవస్థ, ఖజానాకు భారంగా పరిణమించాయని భావిస్తోంది.
కొన్ని రాష్ట్రాలు నిధులను దుర్వినియోగం చేస్తోన్నాయని స్పష్టం చేసింది. ఉచిత పథకాలు/సబ్సిడీలను కొనసాగించాల్సి వస్తే- రాష్ట్రాలు కొన్ని మార్గదర్శకాలు, నిబంధనలను పాటించాల్సి ఉంటుందనీ స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
ఉచిత పథకాలు/సబ్సిడీల కొనసాగింపుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. తాను చెప్పదలచుకున్నది సూటిగా, నిర్మొహమాటంగా బయటపెట్టారు. ఉచిత పథకాలు సందర్భోచితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతే తప్ప ఇష్టానుసారంగా వాటిని అమలు చేయకూడదని పేర్కొన్నారు. ఉచిత పథకాలు, సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా అమలు చేయాల్సి ఉందని సూచించారు.
చట్టబద్ధత అవసరం..
ఉచిత పథకాల అమలుకు చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరం కూడా ఉందని నిర్మల సీతారామన్ తేల్చి చెప్పారు. అది కూడా ఆర్థిక శాఖ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో ఈ పథకాలను పొందుపరిచి, నిధులను కేటాయించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఆదాయం ఉంటే, పథకాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసుకుంటే- ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు.
వాటికే మద్దతు..
విద్య, వైద్య రంగాలతో పాటు రైతులకు ఇచ్చే పలు రాయితీలను కొనసాగించడానికి తాము కూడా పూర్తిగా సమర్థిస్తామని నిర్మల సీతారామన్ అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులకు ఇచ్చే రాయితీలను కొనసాగిస్తామని ఆమె చెప్పారు. రైతులు, పేద కుటుంబాల వారికి సబ్సిడీలు అందాలనేది తమ లక్ష్యమని వివరించారు.
జీతాలు ఇవ్వలేకపోతోంది..
ఉచిత పథకాలు/సబ్సిడీలను అమలు చేస్తోన్న ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలను చెల్లించలేకపోతోందంటూ మీడియాలో కథనాలు వస్తోన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు కూడా చేస్తోన్నారని గుర్తు చేశారు. అదే రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రకాల ప్రకటనలు చేయడానికి, మీడియాలో అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడానికీ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తోందని అన్నారు. తెలంగాణ, బీఆర్ఎస్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment