Interesting: భిక్షాటన చేసి కోటీశ్వరుడు అయిన పదేళ్ల బాలుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భిక్షాటన చేసే బాలుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అదెలా .. ఏదైనా లాటరీ తగిలిందేమో అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.
సినిమా తరహా ట్విస్ట్ ఈ బాలుడి కేసులో చోటు చేసుకుంది. రూర్కీ లోని పిరాన్ కాలియార్ మందిరంలో భిక్షాటన చేస్తున్న 10 సంవత్సరాల వయస్సు యూపీ బాలుడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అప్పటివరకు కడుపు నింపుకోవడానికి నానా పాట్లు పడిన బాలుడి కోసం వెతుక్కుంటూ కోట్ల ఆస్తి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
తల్లిదండ్రులను కోల్పోయి యాచకుడిగా మారిన బాలుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్ పూర్ జిల్లాలో, పండౌలీ గ్రామానికి చెందిన షాజేబ్ ఆలం తన తల్లిదండ్రులు మరణించడంతో ఏడాది క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి యాచకుడిగా మారాడు. 2019 సంవత్సరం షాజేబ్ ఆలం తండ్రి మొహమ్మద్ నవేద్, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అయితే ఆ తర్వాత అతని తల్లి ఇమ్రానా బేగంతో కలిసి జీవిస్తున్న సమయంలో విధి మరోమారు ఆ బాలుడిపై చిన్న చూపు చూసింది. 2021 సంవత్సరంలో తల్లి ఇమ్రానా కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయింది.
పిరాన్ కలియార్ షరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తూ జీవనం
దీంతో అతని జీవితంలో తీరని విషాదం అలముకుంది. ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు, దీంతో తనను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో, తల్లితో కలిసి అనేకసార్లు వెళ్లిన రూర్కీ సమీపంలోని సూఫీ సన్యాసుల పుణ్యక్షేత్రమైన పిరాన్ కలియార్ షరీఫ్ దర్గా వద్దకు వెళ్లి, అక్కడ భిక్షాటన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు షాజేబ్ ఆలం. అయితే అతని తాతకు మాత్రం ఆటను ఎక్కడికి వెళ్ళాడో తెలియక చాలా కాలం వెతికాడు. కానీ అతని ఆచూకీ తెలియలేదు. తాత మొహమ్మద్ యాకూబ్ 2021 సంవత్సరంలో మరణించారు. ఆయన మరణానికి ముందు చేసిన పని ఆ బాలుడి జీవితాన్ని మార్చింది.
బాలుడి పేరు మీద తాత ఆస్తి వీలునామా.. కోటీశ్వరుడు అయిన బాలుడు
ఆయన మరణించే సమయంలో జీవితాన్ని మార్చే వారసత్వాన్ని వదిలివెళ్తారని ఎవరూ ఊహించలేదు. షాజేబ్ ఆలం తాత రెండంతస్తుల ఇల్లు, రెండు కోట్ల విలువైన భూమిని తన పేరు మీద వీలునామా రాసి మరణించాడు. దీంతో సహరాన్ పూర్ లో ఉన్న షాజేబ్ ఆలం బంధువులు అతనికోసం వెతకడం ప్రారంభించగా, చివరికి అతను రూర్కీ లో పిరాన్ కలియార్ షరీఫ్ దర్గా బిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో తన ఇంటికి తీసుకు వచ్చిన బంధువులు, అతనికి తన తాత ఇచ్చిన ఆస్తిని అప్పగించారు. యాచక జీవితాన్ని బదులుగా.. కోటీశ్వరుడు గా ఇప్పుడు ఆ పది ఏళ్ల బాలుడు మారాడు.
మనకు రాసుంది ఎక్కడికి వెళ్ళినా మన వెంటే.. ఈ స్టోరీ చెప్పిందదే
తనకు ఎవరూ లేరని, ఏమీ లేదని భిక్షాటన చేస్తూ బతుకుతున్న బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు అతని తాత మహమ్మద్ యాకుబ్. మనకు రాసి ఉన్నది ఎక్కడికి వెళ్ళినా వస్తుంది రాసి లేనిది ఏం చేసినా రాదు అన్నదానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తల్లిదండ్రులను కోల్పోయి, పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తున్న బాలుడికి తన జీవితంలో జరిగేది అసలు ఊహకే వచ్చి ఉండదు. ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారతాడని ఊహించి ఉండడు. ఈ కథ తెలిసిన వారంతా ఊహించనిది జరగటమే కదా జీవితం అంటున్నారు.
0 Comments:
Post a Comment