ఏపీలో `ఆ పదం` పలకడం నేరం- నిషేధించిన ప్రభుత్వం: సినిమాలు, సీరియళ్లల్లో కూడా..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. వెనుకబడిన సామాజిక వర్గాలకు అనుకూలంగా మరో నిర్ణయాన్ని తీసుకుంది.
బీసీ సామాజిక వర్గాల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తోన్న డిమాండ్‌కు సానుకూలంగా స్పందించింది. ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్నారు.
భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎవరూ కూడా ఈ పదాన్ని పలకకూడదని ఆదేశించింది. చివరికి సినిమాలు, టీవీ సీరియళ్లలోనూ దీన్ని ఉచ్ఛరించకూడదని తెలిపింది. రాజకీయ ప్రసంగాలు, సాధారణ సభలు-సమావేశాల్లోనూ ఈ పదాన్ని పలకకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధించిన తరువాత కూడా ఈ పదాన్ని ఎవరైనా ఉచ్ఛరించితే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తూ వస్తోంది. భట్రాజు అసోసియేషన్, ఇతర బీసీ సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. వినతి పత్రం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భట్రాజులది పండిత కులమని, అదే గౌరవంతో చూడాల్సిన అవసరం ఉందనేది ఆయా సంఘాల ప్రతినిధులు వాదన. ఓ సినిమాలో భట్రాజు కులాన్ని యాచక వృత్తిగా వర్ణించడాన్ని తప్పు పట్టారు. తమ కులాన్ని కించపరిచేలా చూపించడం పట్ల అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నన్నయ్య భట్టారకుడు, నారాయణభట్టు, డిండిమభట్టు, కుంకుమభట్టు వంటి కవులు ఈ కోవకు చెందినవారేనని, అలాంటి కులాన్ని కించపరిచడం సరైంది కాదంటూ భట్రాజు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని పలకడం తమ కులాన్ని కించపరిచినట్టవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది.
0 Comments:
Post a Comment