అక్కినేని నాగార్జునకు రైతుబంధు డబ్బులు అవసరమా? వాళ్ళ సంగతేంటి? రిటైర్డ్ ఐఏఎస్ సంచలనం!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. కానీ రైతు బంధు పథకంలో ధనవంతులకు ప్రయోజనం చేకూరుతుందని అనేకమార్లు ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రైతుబంధు పథకాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణం గా మారాయి.
నాగార్జునను టార్గెట్ చేసిన ఆకునూరి మురళి
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి.. తెలంగాణ రాష్ట్రంలో ఈయన పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. తాజాగా ఆకునూరి మురళి హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల ఎకరాలు ఉన్న ధనవంతులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయడం ఎందుకు అన్న ప్రశ్నను ఆయన నేరుగా సంధించారు. టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేని కూడా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, నాగార్జున కు రైతుబంధు డబ్బులు అవసరమా అంటూ ఆకునూరి మురళి ప్రశ్నించారు.
సంపన్న వర్గాలకు రైతు బంధు ఇవ్వటంలో ఆంతర్యమేంటి?
అమెరికాలో 30 ఏళ్లుగా పని చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల ఎకరాలను కలిగి ఉంటే, అతని ఖాతాలో కూడా రైతుబంధు డబ్బులు పడుతున్నాయని, అత్యంత సంపన్న వర్గాలకు రైతుబంధు డబ్బులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు ఆకునూరి మురళి. తెలంగాణ ప్రభుత్వం అందించే ఎకరానికి ఐదు వేల రూపాయలు సంవత్సరంలో రెండు సార్లు వారి ఖాతాలో పడుతున్నాయని, వందల ఎకరాలు ఉన్న వారు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఏటా లబ్ధి పొందుతున్నారని మురళి పేర్కొన్నారు.
మంత్రుల ఖాతాల్లోనూ రైతు బంధు డబ్బులు.. కౌలు రైతుల గతేంటి?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ప్రతి జిల్లాలోనూ వందల ఎకరాలను కొనుగోలు చేశారని, వారందరి ఖాతాలలోనూ రైతుబంధు డబ్బులు పడుతున్నాయన్నారు. ధనవంతులకు, మంత్రులకు రైతుబంధు ఇవ్వడం దేనికి అని ప్రశ్నించిన ఆకునూరి మురళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది రైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ధనవంతులైన సంపన్న వర్గాలకు కాకుండా రైతుబంధు నిధులు దిక్కుతోచని దయనీయమైన స్థితిలో ఉన్న రైతులకు అందిస్తే రైతుబంధు పథకానికి అర్థం ఉంటుందని ఆకునూరి మురళి చెప్పారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో రైతుబంధు ద్వారా జరుగుతున్న లబ్ది పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
0 Comments:
Post a Comment