దళితులకు కేంద్రం షాక్.. ఆ రెండు మతాల్లోకి మారితే ఎస్సీ ప్రయోజనాలన్నీ రద్దు..
మన దేశంలో ఎస్సీ (Scheduled Castes)లుగా ఉన్న దళితుల్లో కొంతమంది మతాలను మార్చుకుంటున్నారు. ఈ పరిస్థితికి బ్రేక్ వెయ్యాలనుకున్న కేంద్ర ప్రభుత్వం..
వారికి ఎస్సీ హోదాలో కల్పించే ప్రయోజనాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దళితులుగా ఉన్నవారు ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారితే.. ఇక వారు ఎస్సీ హోదాలో పొందే ప్రయోజనాలు పొందలేరు అని కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకు రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్డర్ ఉందని వివరించింది.
రాజ్యాంగంలోని ఎస్సీల ఆర్డర్ 1950.. రాజ్యాంగ విరుద్ధమైన ఏ అంశాన్నీ సమర్థించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంటరానితనం ఇతర కొన్ని కారణాల వల్ల ఎస్సీలు... క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారడానికి ఈ ఆర్డర్ మినహాయింపు ఏమీ ఇవ్వట్లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఈ ఆర్డర్‌కి కాలక్రమంలో సవరణలు చేస్తూ ఉన్నారు. దీని ప్రకారం.. హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాన్ని.. తమ మతంగా ప్రకటించే వ్యక్తిని.. షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)లో సభ్యులుగా పరిగణించరు.
జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రతిపాదనను తాము ఆమోదించట్లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను కూడా ఎస్సీల జాబితాలో చేర్చాలని ఈ కమిషన్ ప్రతిపాదించింది. ఇది లోపంతో కూడిన ప్రతిపాదన అని కేంద్రం తెలిపింది.
షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950 అనేది.. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును తెలిపే ఆర్టికల్ 14, మత వివక్షను అడ్డుకునే ఆర్టికల్ 15కి వ్యతిరేకంగా ఉంది అని చెబుతూ.. సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన ఓ అభ్యర్థనపై స్పందిస్తూ కేంద్రం తాజా స్పష్టత ఇచ్చింది. జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది.
చారిత్రకంగా ఎస్సీ హోదా కలిగి.. కొన్ని కారణాల వల్ల మతం మార్చుకున్న వారికి ఇప్పుడు ఎస్సీ హోదా ఇచ్చే అంశంపై రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కేంద్రం ఈమధ్యే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కే జీ బాలకృష్ణన్ అధ్యక్షత వహిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ కమిటీ తన రిపోర్టును ఇస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
0 Comments:
Post a Comment