త్రిశంకు స్వర్గంలో ఉపాధ్యాయుల బదిలీలు..
పామర్రు, రాయవరం: నిన్న మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా బ్రేక్‌పడింది.
తుది తీర్పు ఎలా ఉంటుంది.. మళ్లీ బదిలీల ప్రక్రియ సజావుగా సాగుతుందా? లేదా? ఇప్పటికి నిలిపివేసి వేసవిలోనే చేపడతారా? జీవోల్లోని మార్గదర్శకాలు కోర్టు సూచనల ఆధారంగా మార్పు చేస్తారా? మళ్లీ షెడ్యూలు ప్రకటిస్తారా? ఇలా ఎన్నో సందేహాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఉపాధ్యాయ వర్గాల వాదనలను పరిశీలిస్తే.. పాత స్టేషన్ పాయింట్లు 2020 వారికే కాకుండా తమకూ ఇవ్వాలని 2015, 17ల్లో బదిలీ అయిన వారు కోరుతున్నారు. పదోన్నతి పొంది ఏడాది దాటిపోయినందున అడ్హాక్ విధానం ఉండకూడదని ఆ వర్గం వారంటున్నారు. జూనియర్లు కదిలితేనే రేషనలైజేషన్ పాయింట్లు ఇస్తామంటున్నారు.. సీనియర్లు వెళ్దామనుకుంటే వారికి కూడా ఇవ్వాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్లు సున్నా ఇచ్చి దరఖాస్తులు పెట్టుకోమనడం అన్యాయమని ఎయిడెడ్ ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. 300 మంది విద్యార్థులు దాటిన ఉన్నత పాఠశాలకు రెండు పీఎస్ పోస్టులు కేటాయించాలని సంబంధితులు కోరుతున్నారు. ఇలా భిన్న వాదనలు తెరపైకి తెచ్చారు.
ఎదురుచూపులు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు మొత్తం 14,310 మంది ఉన్నారు. కేడర్ల వారీగా చూస్తే 355 గ్రేడ్-2, 313 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 1,414 మంది లాంగ్వేజీ స్కూల్ అసిస్టెంట్లు, 2,423 మంది నాన్ లాంగ్వేజీ స్కూల్ అసిస్టెంట్లు, 3,322 మంది సెకండరీగ్రేడు, 101 మంది భాషా పండితులు, 58 మంది పీఈటీలున్నారు. వీరిలో 7,986 మంది బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ప్రతి నిమిషం వాట్సాప్‌లు చూసుకుంటూ, కొత్త ప్రకటనలు ఏం వస్తాయోనని ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్నారు.
పరీక్షలపై ప్రభావం..
ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి జరుపుతామని బోర్డు షెడ్యూలు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు కూడా పదిహేను రోజుల అటు ఇటుగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉండొచ్చు. ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులపై ప్రభావం చూపుతుందన్న సందేహాలు వస్తున్నాయి. జనవరి రెండో తేదీ నుంచి అన్ని పాఠశాలల్లోనూ సమ్మెటివ్-1 పరీక్షలు జరపాలని సమయసారిణి కూడా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బదిలీల వ్యవహారాన్ని వెంటనే కొలిక్కి తేవాలని వారు కోరుతున్నారు.
0 Comments:
Post a Comment