✍️లక్షల జీతం తీసుకుంటున్నారుగా... చాయ్, సమోసాలు తెప్పించండి!
♦️ఎంఈవోలకు వైకాపా నేతల హుకుం
🌻ఈనాడు, కర్నూలు: ‘మీ మండలంలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించండి. లక్షల జీతాలు వస్తున్నాయిగా... వచ్చిన వారందరికీ చాయ్, సమోసాలు మీరే ఇవ్వండి’ అని ఎంఈవోలను వైకాపా నేతలు ఆదేశిస్తుండటం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లాకు 4,500, నంద్యాల జిల్లాకు 5,220 ట్యాబ్‌లు అందాయి. వీటిని ఈ నెల 22 నుంచి 28లోగా విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. పంపిణీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది. అయితే... ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో వైపాకా ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఎంఈవోలకు ఫోన్ చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచిస్తున్నారు. మండల నాయకులు కలగజేసుకుని వేదిక, షామియానా, కుర్చీలు, బొకేలు, బ్యానర్లు, ముఖ్య నేతలపై చల్లేందుకు పూలు, వచ్చిన వారందరికీ చాయ్, బిస్కెట్, సమోసాలు సమకూర్చాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ చేయాలంటే కనీసం రూ.30-40 వేల ఖర్చు వస్తుందని, ఎలా భరించాలని ఎంఈవోలు ప్రశ్నిస్తే... ‘ఉపాధ్యాయులు లక్షల జీతాలు తీసుకుంటున్నారుగా... వాటిల్లోంచి ఇవ్వండి’ అంటూ ఆదేశాలిస్తుండటం గమనార్హం. చేసేదిలేక ప్రతి మండల పరిధిలోని జడ్పీ, యూపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒక్కొక్కరు రూ.3-5 వేలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల ఎంఈవోలకు గురువారం వైకాపా నేతల నుంచి ఈ ఆదేశాలు అందాయి. ఒక ప్రధానోపాధ్యాయుడికి స్థానిక నాయకుడు ఒకరు రెండు వేల మందికి టీ, సమోసాలు ఏర్పాటు చేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
0 Comments:
Post a Comment