తిరుమల భక్తులకు అలర్ట్ - నేటి నుంచి శ్రీవారి సేవల్లో మార్పు..!!
తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు కానుంది. నేటి సాయంత్రం నుంచి ధనుర్మాసం నెల ప్రారంభం అవుతోంది. సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహించనుంది.
ఈ మధ్య కాలంలో టీటీడీ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో సాధారణ భక్తులకు వెసులుబాటు కలుగుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం..వైకుంఠ ద్వార దర్శన ప్రత్యేకంతో పాటుగా సంక్రాంతి వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీంతో, టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది.
నేటి నుంచి ధనుర్మాసం నెల
ఈ రోజు మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2022, జనవరి 14న ముగియనున్నాయి. ఆగమ శాస్త్రంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. రేపటి నుంచి 14 వరకూ తిరుప్పావై పఠనం జరగనుంది. సుప్రభాత సేవ బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహించనుంది. నేడు స్వామివారి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 63,549 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 23,919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నెల రోజుల పాటుగా సుప్రభాత సేవ రద్దు
ప్రతి రోజు తెల్లవారుజామున స్వామి వారిని సుప్రభాతంతోనే మేలుకొలుపు వినిపిస్తారు. ఆ తర్వాత అన్ని కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఈ సుప్రభాత సేవ సమయంలో భక్తులు వెయ్యి కళ్లతో స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ సేవలో పాల్గొనేందుకు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఆసక్తితో ఉంటారు. స్వామి దర్శనంతో తమ జన్మ దన్యం అయినట్లు భావిస్తారు. అయితే, శ్రీవారి సేవల్లో సంప్రదాయాల కొనసాగింపులో భాగంగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
సంక్రాంతి వరకు తిరుమలలో రద్దీ..
కొత్త సంవత్సరం ప్రారంభం కానుండటంతో శ్రీవారి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జనవరి 1న వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో, ప్రోటోకాల్ జాబితాలో ఉన్న ప్రముఖులు వస్తే వారికి బ్రేక్ దర్శనం అవకాశం ఇవ్వాలని, సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందని, దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసారు.
0 Comments:
Post a Comment