ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆమె సతీమణి మిచెల్ ఒబామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా..
వ్యక్తిగత కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు. అంతేకాదు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ.. మోస్ట్ పాపులర్ కపుల్‌గా పేరుపొందారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సామన్య ప్రజల్లా వీరిద్దరూ ఎంచక్కా విహారయాత్రలకు వెళ్తుంటారు.
ఆ తర్వాత వాటిని సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా 'కెల్లీ క్లర్క్‌సన్ షో'కు హాజరైన మిచెల్ ఒబామా తమ 30వ వివాహ వార్షికోత్సవం రోజున జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నట్లు ఇండిపెండెంట్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
1992లో నూతన దంపతులుగా హనీమూన్‌కు వెళ్లిన ఒబామా జంట సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అక్టోబరులో మళ్లీ హనీమూన్‌ను ప్లాన్ చేసుకున్నారట. ఓ కారును అద్దెకు తీసుకొని కాలిఫోర్నియా పశ్చిమ తీరానికి వెళ్లారు.
అయితే, గతంలో కంటే ఈసారి హనీమూన్ కాస్త కొత్తగా ఉందని ఆమె అన్నారు. తొలిసారి ఎంతో ఏకాంతంగా అనిపించిందని, ఇప్పుడు మోటారు కార్లతో జనం రయ్..రయ్ మంటూ వెళ్తున్నారని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దూరం నుంచి తమను గమనిస్తున్నారని అన్నారు.
అయితే, హనీమూన్‌లో ఉన్నన్ని రోజులూ తమ చిలిపి చేష్టలు చూసి వారంతా అక్కడి నుంచి దూరంగా పారిపోయేవారని ఆమె సరదాగా గుర్తు చేసుకున్నారు. వారు తమ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారని కూడా చెప్పారు మిచెల్.
ఇంతకుమించి కోరుకోలేదు
వివాహబంధంతో 1992లో ఒక్కటైన ఈ జంట.. ఈ ఏడాది అక్టోబరు 4న 30 ఏళ్ల వివాహ జీవితాన్ని పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను బరాక్ ఒబామా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
''మిచెల్.. 30 ఏళ్ల తర్వాత కూడా మునిపటిలాగే ఎందుకున్నావో అర్థం కావడం లేదు. ఆ రోజు నేను లాటరీ గెలుచుకున్నానని నాకు తెలుసు.
అందుకే ఇంతకుమించిన జీవిత భాగస్వామిని కోరుకోలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్వీట్ హార్ట్'' అంటూ రాసుకొచ్చారు.
0 Comments:
Post a Comment