ఎన్నికల ప్రచారం (Election campaign) మొదలెట్టడానికి శుభగడియలు.. పార్టీ టికెట్ల కేటాయింపు, ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రభుత్వాధినేతలు, మంత్రుల ప్రమాణస్వీకారం, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వరకు అన్నింటికీ సుముహూర్తాలు..
ఇక రంగురాళ్లు, ఉంగరాలు ధరించే నేతలకు లెక్కే లేదు. ఇలా గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ కేంద్రంగా దేశాన్ని ఏలిన పలువురు భారత మాజీ ప్రధానులు, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎందరో నేతలు జ్యోతిషం, వాస్తులను ప్రగాఢంగా విశ్వసించేవారు, విశ్వసిస్తున్నారు కూడా.
'తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018లో ఎన్నికలు వచ్చాయి' అంటూ ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ జడ్జి వీ.రామసుబ్రమణియన్ చమత్కరించడంతో 'రాజకీయాల్లో జ్యోతిషం' చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ''తెలంగాణలో జ్యోతిషం ప్రకారం 2018 ఎన్నికలు వచ్చాయి.
అక్కడ జ్యోతిషం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ పిటిషన్‌ను విచారించాలంటే కూడా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావాలేమో..?'' అని వ్యాఖ్యానించిన జడ్జి.. సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ తొలి దఫా ప్రభుత్వం పూర్తికాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో దేశంలో జ్యోతిషం-వాస్తులను నమ్మిన పలువురు రాజకీయ నాయకులు, వారి నిర్ణయాలను ఒకసారి పరిశీలిద్దాం...
జ్యోతిష్కుల సలహాల ఆధారంగా రాజకీయ నాయకులు అడుగులు కొత్తమీ కాదు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచీ రాజకీయ నేతల్లో ఈ ఒరవడి కనిపిస్తోంది.
ముఖ్యంగా దేశ విభజన సమయంలో ఆగస్టు 14, ఆగస్టు 15 తేదీలను ఎంచుకోవాలని భారత్, పాకిస్తాన్‌లను నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 'లార్డ్ మౌంట్‌బాటన్' కోరగా.. స్వాతంత్ర్య వేడుకలకు మంచి ముహూర్తం సూచించాలని ప్రముఖ జ్యోతిష్కుడు సూర్యనారాయణ వ్యాస్‌ను డా.రాజేంద్ర ప్రసాద్ (మాజీ రాష్ట్రపతి) కోరారట. ఆ తర్వాత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు కూడా జ్యోతిషాన్ని నమ్మేవారట.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. జ్యోతిషంపై ఆయన ఆసక్తికనబరిచేవారని గుజరాత్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు గతంలో పేర్కొన్నారు.
బీజేపీ నేతల జాబితాలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా ఉన్నారు. జ్యోతిషాన్ని బలంగా నమ్మేవారని ఆమె సన్నిహితులే ఇదివరకు పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా గతంలో ఒక ఎన్నికల ర్యాలీలో దిష్టి తగలకుండా నిమ్మకాయలు, మిరపకాయలతో కూడిన దండను ధరించి వార్తల్లో నిలిచారు.
యూపీ సీఎంలకు నోయిడా శాపం...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు నోయిడా నగరాన్ని సందర్శించేందుకు తెగ భయపడిపోయేవారట. ఎందుకంటే ఆ నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రులు అధికారాన్ని కోల్పోతారని, తిరిగి ఆఫీస్‌లో అడుగుపెట్టలేమని అక్కడి సీఎంలు విశ్వసించేవారట.
ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్‌లు నోయిడా సందర్శించిన కొంతకాలానికే తమ పదవులను కోల్పోవడమే ఈ భయాలకు కారణమైంది. ఎంతగా భయపడేవారంటే అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు నోయిడాలో 2013లో ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమ్మిట్ జరిగినా దానికి హాజరవ్వలేదు.
గతంలో మరి కొందరు సీఎంలు కూడా ఇదే ధోరణిని ప్రదర్శించారు. అయితే యూపీ మాజీ సీఎం మాయావతి మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉన్నారు. ఆమె ధైర్యంగా నోయిడాలో పర్యటించారు. ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జ్యోతిష్కులను కలిసిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో గతంలో చక్కర్లు కొట్టారు. మీడియాలో పెద్దగా హైలెట్ కాకపోయినప్పటికీ వీడియోలు వైరల్‌గా మారాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నమ్మకాలు కాస్త ఎక్కువనే చెప్పారు. ఒక కుర్చీకి ఆమె ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంతలా అంటే ఆమె కాన్వాయ్‌లో ఈ కుర్చీ తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆ కుర్చీని తీసుకెళ్లవారు. మరోవైపు ఓ జ్యోతిష్కుడి సూచనల ప్రకారం... 'క్రిష్ణ' అనే ఏనుగును గురువాయుర్ ఆలయానికి బహుకరించారు. సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో తన పేరు జయలలిత (Jayalalitha) కాస్త జయలలితా (Jayalalithaa)గా చిన్న మార్పు చేశారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సైతం తన పేరు స్పెల్లింగ్‌లో మార్పులతో బీఎస్ యెడియూరప్పగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా పేరులో మార్పులు చేసుకున్నారు.
హెచ్‌డీ కుమారస్వామిని (HD Kumaraswamy) కాస్త కుమారస్వామి (Kumaaraswamy)గా మార్చుకున్నారు. దేవెగౌడ కుటుంబ సభ్యులు హసన్ జిల్లాలో కొడి ముత్తు స్వామిని క్రమంగా కలుస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే.
తెలుగు నేతలకూ ప్రగాఢ విశ్వాసం..
సీఎం కేసీఆర్ (Cm Kcr) జ్యోతిషం, వాస్తులను (Astrology - Vastu) అపారంగా నమ్ముతారనే పేరుంది. వాస్తు భయంతోనే సచివాలయానికి వెళ్లడం లేదంటూ ఆయనపై విపక్షాలు లెక్కలేనన్నిసార్లు విమర్శలు గుప్పించాయి. అయినా ప్రతిపక్షాల అభ్యంతరాలను కేసీఆర్ పట్టించుకోలేదు.
చివరకు పాత సచివాలయాన్ని కూలదోసి కొత్త నిర్మాణాలకు పూనుకున్నారు. కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. మరోవైపు సీఎం కేసీఆర్ యజ్ఞయాగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇక ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) కూడా జ్యోతిషం, వాస్తులను బలంగా విశ్వసిస్తారు.
టీపీసీసీగా ఎన్నికైన సమయంలో గాంధీభవన్ వాస్తు మార్పులు చేశారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వాస్తుశాస్త్రాన్ని విశ్వసిస్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాస్తు మార్పులు చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక నేత టీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara chandrababu Naidu) కూడా వాస్తు-జ్యోతిషాలను విశ్వసిస్తారు.
ముఖ్య కార్యక్రమాలను మంచి సమయం చూసుకుని మొదలుపెడుతుంటారని గతంలో ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment